జగిత్యాల, ఫిబ్రవరి 28 : ఆర్థిక క్రమశిక్షణతో(Financial discipline) కూడిన పొదుపే భవిష్యత్తుకు భరోసా అని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా ‘ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు’ నిర్వహిస్తున్న తరుణంలో ఈరోజు జిల్లా లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తమ ఆదాయ, వ్యయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎదుటి వారిని చూసి ఆడంబరాలకు పోయి తమ ఆర్థిక స్థోమతకు, ఆదాయానికి మించి ఖర్చులు చేస్తున్నారని తద్వారా వాటి కోసం అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు.
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఎంత సంపాదిస్తున్నమన్నది కాకుండా ఎలా ఖర్చు చేస్తున్నామన్నదే ప్రధానం అన్నారు. దాని పైనే మన వ్యక్తిగత ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. పొదుపు చేయడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే ఎంచుకోవాలని అప్పుడే మీ పొదుపు డబ్బులకు సరైన భద్రత, భరోసా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి సత్యమ్మ, బిసి సంక్షేమ అధికారిణి సునీత, జిల్లా ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.