మెట్ట్పల్లి ఏప్రిల్ 15 : పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పరుగులు తీస్తున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి. పసుపు కాడి (కొమ్ము) రకానికి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.9,111, గోళ (మండ) రకానికి గరిష్టంగా రూ.13,388, కనిష్టంగా రూ.9,002, చూర రకానికి గరిష్టంగా రూ.10,511, కనిష్ఠంగా రూ.7,796 ధర పలికింది. కాగా కాడి, గోళ రకాలకు ఈ సీజన్లో ఇప్పటి వరకు పలికిన ధరల్లో ఇదే అధికం కావడం విశేషం.
అయితే, ఇవే ధరలు కొనసాగుతాయా? మళ్లీ తగ్గుముఖం పడుతాయా? అనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికే రైతుల దగ్గరి నుంచి 80 శాతానికి పైగా పసుపు అమ్మకం జరిగి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రైతుల నుంచి భారీ ఎత్తున పసుపు విక్రయానికి తెచ్చిన సమయంలో కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని పలు మార్లు రైతులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. మెజార్టీ శాతం పసుపు అమ్మకం పూర్తయ్యాక ధర పెరగడం వల్ల ఒరిగే ప్రయోజనం లేదనే వాదన చాలా మంది రైతుల నుంచి వినిపిస్తోంది. కాగా, మంగళవారం మార్కెట్‌కు 857 క్వింటాళ్ల పసుపు విక్రయానికి వచ్చిందని, ఇప్పటి వరకు మార్కెట్లో మొత్తం 45,386 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు.