Ramagundam Baldia | కోల్ సిటీ, అక్టోబర్ 8: రామగుండం నగర పాలక సంస్థలో ఒకవైపు రోడ్డు నిర్మాణం పనులు జరుగుతుండగానే మరోవైపు కంకర తేలి గుంతలు పడుతున్నాయనీ, నాణ్యతకు పాతర వేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ కోరారు. ఈమేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రామగుండం కార్పొరేషన్లో టీయూఎఫ్ ఐడీసీ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరినట్లు తెలిపారు.
సుధాకర్ ఇన్ఫ్రా కాంట్రాక్టర్స్ టెండర్ ద్వారా 5 శాతం ఎక్కువతో పనులు దక్కించుకొని నాణ్యత లోపంతో పనులు చేస్తున్నా బల్దియా అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరించడం పట్ల అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక స్కూప్స్ ఐస్ క్రీం పార్లర్ నుంచి పద్మావతి కాలనీ వరకు కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు పట్టుమని పది రోజులకే మళ్లీ కంకర బయటకు వచ్చి రోడ్డంతా గుంతలు తేలి అద్వానంగా తయారైందన్నారు. అలాగే లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మేకల మార్కెట్, ఉల్లిగడ్డల బజారు ఏరియాలో సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పనుల్లో కూడా నాణ్యత లేక కంకర బయటకు రావడంతో ప్రజలు రోడ్డుపై నడవలేని దుస్థితి దాపురించిందన్నారు.
కాంట్రాక్టర్లు, నగర పాలక అధికారులు కుమ్మక్కై రూ. కోట్ల ప్రజాధనంను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రూ.13 కోట్ల యూజీడీ పనుల్లో కూడా ఇవే అక్రమాలు జరిగే పరిస్థితి ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రామగుండంలో క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ సమర్ధవంతంగా పని చేయడం లేదనీ, దీనితో కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా పనులు చేపడుతున్నారనీ, ఇందుకు మున్సిపల్ అధికారుల సహకారం ఉండటం విచారకరమనీ, వెంటనే వీటిపై విచారణ జరపాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు.