సారంగాపూర్ : రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పలు గ్రామాల పేర్లను ఆయా గ్రామాల ప్రజలు గ్రామాల ప్రాచీన ఆనవాళ్లు, చిహ్నాలతో ముద్దుగా మారు పేరుతో ఇప్పటికీ పిలుచుకుంటున్నారు. కొత్త ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు కొంత తడబడినా విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. గ్రామంలోని వృద్ధులైతే అసలు పేరును మరిచి ముద్దు పేర్లనే పిలుచుకొని మురిసిపోతున్నారు.
సారంగాపూర్ మండల పరిధిలోని పెంబట్ల గ్రామాన్ని దుబ్బ అని సంభోదిస్తున్నారు. 200ల సంవత్సరాల క్రితం దుబ్బ అనే ప్రాంతంలో శివుడు వెలియడంతో దుబ్బ రాజన్న దేవస్థానాన్ని నిర్మించి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెంబట్ల గ్రామస్తులు ఆ గ్రామాన్ని తమ ఇలవేల్పు దుబ్బ రాజన్న పేరులోని దుబ్బగా పిలుచుకోవడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికీ పెంబట్ల గ్రామానికి వచ్చే గ్రామస్తులు ఎక్కడకు వెళుతున్నావంటే దుబ్బ కాడికి, దుబ్బ రాజన్న కాడికి అని చెబుతారు.
మండలంలోని కోనాపూర్ గ్రామాన్ని మారు పేరుతో తాతమ్మా అని ఇప్పటికీ వృద్ధులు పిలుస్తున్నారు. కొత్తగా గ్రామానికి వచ్చేవాళ్లు తాతమ్మా అంటే ఆశ్చర్యపోతున్నారు. గతంలో కోనాపూర్ స్టేజీ వద్ద గ్రామ దేవతలు తాతమ్మలను నెలకొల్పడంతో అప్పటి నుంచి కోనాపూర్‌కు తాతమ్మ అనే పేరు పడింది. గ్రామానికి చెందిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి కోనాపూర్‌కు వచ్చేప్పుడు ఎక్కడకు వెళ్తున్నావంటే తాతమ్మ కాడికి అంటారు.
గతంలో లక్ష్మీదేవిపల్లి స్టేజి వద్ద పెద్ద ఇప్ప చెట్టు ఉండడంతో గ్రామానికి వచ్చే వారు ఎక్కడకు అంటే ఇప్ప కాడికి వెళ్తున్నామని అంటుంటారు. వృద్ధులందరూ ఇప్పగా పిలుచుకునే లక్ష్మీదేవిపల్లి గ్రామానికి మారుపేరు ఇప్పటి తరానికి తెలియనే తెలియదు. పసిపిల్లలను చంటి, బుజ్జి, నాని అని పిలుచుకుంటున్నట్టే సొంత గ్రామాలపై మమకారంతో ప్రాచీన ఆనవాళ్లతో మారుపేర్లు పిలుచుకుంటూ గత స్మృతులను ఇప్పటికీ నెమరువేసుకుంటుండటం విశేషం.