హైదరాబాద్: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కోరుకున్నోడిని ప్రేమ వివాహం చేసుకున్న ఆరు రోజులకే యువతి ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన బోదాసు గంగోత్రి (22), అదే కాలనీకి చెందిన అల్లిపు సంతోష్ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరు.. రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. దీంతో గత నెల 26న పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకున్నారు. అయితే, దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న గంగోత్రి భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. అదే రోజు భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇరువురికి తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో సంతోశ్ తన భార్యతో కలిసి తమ ఇంటికి వెళ్లిపోయారు.
అయితే, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గంగోత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న గంగోత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురవడం, అత్తింట్లో ఏదైనా జరగడంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.