కోరుట్ల, ఆగస్టు 12 : కోరుట్ల పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో 100 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా పలు వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా వార్డుల్లో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై కాలనీవాసులకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి నుంచి వచ్చే తడి, పొడి, హనికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని కోరారు.
దుకాణదారులు ట్రెడ్ లైసెన్స్ కలిగి ఉండాలని లేనిచో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు పట్టణంలోని గడి గురుజు మార్కెట్ ఏరియా, వివేకానంద నగర్, నంది చౌరస్తా, కొత్త బస్టాండు వద్ద కళాజాత బృందం సభ్యులచే పాటల రూపంలో ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలు, అపరిశుభ్రతతో వచ్చే వ్యాధులు, నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, అకౌంటెంట్ ఆఫీసర్ శివకుమార్ ఇంచార్జీ శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, మెప్మా టీఎంసీ శ్రీరామ్ గౌడ్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ వార్డు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.