జగిత్యాల : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఆదివారం మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎంపీ అరవింద్ రెండు రోజుల క్రితం దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీసు చట్టమని హేళనగా మాట్లాడటం అనైతికమన్నారు. పద్ధతి మార్చుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా చట్టాలపై ఈవిధంగా మాట్లాడటం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. అరవింద్ దళిత సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ అరవింద్‌పై మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పిటిషన్ అందజేశారు.
కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఎర్ర రమేష్ ఉపాధ్యక్షుడు దినేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు పెద్దిరెడ్డి లక్ష్మణ్, మేకల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి సిద్ధ బాలరాజ్, మద్దెల నర్సయ్య, కడకుంట్ల వినయ్ సాహూ, పట్టణ ప్రధాన కార్యదర్శి దళిత రాజు, నిగ రవి, ఉయ్యాల లక్ష్మణ్, నల్ల లక్పతి, పెద్దిరెడ్డి అశోక్, గడ్డం సిద్ధార్థ, బోల్లె శంకర్, బాపురపు క్రాంతి, కాలేశ్వరపు మహేష్ పాల్గొన్నారు.