KARIMNAGAR ACB | కరీంనగర్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం దాడి చేసి రూ. 60 వేలు లంచం తీసుకుంటున్న మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఏ పురుషోత్తంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కరీంనగర్ పండ్ల మార్కెట్లో లైసెన్స్ రెన్యూవల్ కోసం మహ్మద్ గఫూర్ అలియాస్ నిమ్మకాల పాషా నుంచి ఈ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ పండ్ల మార్కెట్లో 15 మంది వ్యాపారులు ఉన్నారు. వీరు 2021లో లైసెన్స్లు తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. మూడేళ్లకోసారి లైసెన్స్లు రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మార్చి నెలాఖరులోగా రెన్యూవల్ చేసుకోవల్సి ఉండగా వ్యాపారులు మార్కెట్ కార్యదర్శిగా ఉన్న పురుషోత్తంను పలు సార్లు సంప్రదించారు. కానీ ఆయన మొదట ఒక్కొక్కరు రూ. 2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు వ్యాపారులు ఒప్పులేదు. మరోసారి రూ.లక్ష డిమాండ్ చేశారు.
శుక్రవారం కార్యదర్శి పురుషోత్తంతో సమావేశమైన పండ్ల వ్యాపారులు తాము అంత పెద్ద మొత్తం ఇవ్వ లేమని, ఒక్కొక్కరం రూ. 60 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు అంగీకరించిన కార్యదర్శి ఈ రోజు లైసెన్స్లు రెన్యూవల్ చేయించుకోవాలని నోటీసులు సిద్దం చేశారు. అయితే తన కుమారుడు మహ్మద్ ఫజల్ పేరిట ఉన్న న్యూ కరీంనగర్ ఫ్రూట్ కంపెనీ రెన్యూవల్ కోసమని వ్యాపారి మహ్మద్ గఫూర్ ఎలియాస్ నిమ్మకాయల పాషా ఏసీబీని ఆశ్రయించారు. శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాషా రూ. 60 వేలు తీసుకెళ్లి కార్యదర్శి పురుషోత్తంకు ఇచ్చే ప్రయత్నం చేశారు. అతను ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కరివేద శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలని చెప్పడంతో పాషా అతనికి ఇవ్వగానే ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దర్యాప్తు జరిపిన ఏసీబీ అధికారులు పురుషోత్తంతోపాటు సెక్యూరిటీ గార్డు శ్రీనివాస్ రెడ్డిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు.
లంచం కోసం వారం నుంచి వేదింపులు..
పండ్ల మార్కెట్లో వ్యాపారుల లైసెన్స్ రెన్యూవల్ కోసం కార్యదర్శి పురుషోత్తం తమని వారం రోజులుగా వేదిస్తున్నాడని పాషాతోపాటు పలువురు వ్యాపారులు తెలిపారు. వ్యాపారులతో జరిగిన ఫోన్ సంభాషనలు, వీడియో రికార్డులు కూడా ఏసీబీ అధికారుల వద్ద ఉన్నాయి. అయితే, లంచం డబ్బుల కోసం తమకు తరుచూ ఫోన్లు చేసి వేదిస్తున్నాడని అందుకే ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు.