మల్యాల, జూన్ 23: ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజావాణి (Prajavani) కార్యక్రమం నిర్వహిస్తున్నది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లతోపాటు మండల రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజల విజ్ఞప్తులను స్వీకరిస్తారు. అయితే కొన్నిచోట్ల అధికారుల అలసత్వంతో ఈ కార్యక్రమం అభాసుపాలవుతున్నది.
మల్యాల మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు డుమ్మా కొట్టారు. ఉదయం 10.50 గంటలు దాటినప్పటికీ ఏ ఒక్క శాఖ అధికారి కూడా రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారులు డుమ్మా కొడితే అర్జీలను ఎవరికి ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ విషయమై మండల తాసిల్దార్ వసంతను వివరణ కోరేందుకు ప్రయత్నించగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు.