మల్యాల, సెప్టెంబర్ 25: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల విద్యాభివృద్ధి, ప్రగతి, ప్రవర్తనపై సమీక్షించేందుకు సెప్టెంబర్ 26వ తేదీన టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ (TPM) నిర్వహించనున్నట్లు మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మోతే శివరామకృష్ణ తెలిపారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులు తప్పకుండా హాజరుకావాలనే ఉద్దేశంతో గురువారం మహిళా అధ్యాపకులు రచన, అనూషలు విద్యార్థుల ఇండ్లకు స్వయంగా వెళ్లి తల్లిదండ్రులను సంప్రదించి, వారికి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం అన్నారు. వారి భాగస్వామ్యం లేకుండా విద్యార్థుల అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పరీక్ష ఫలితాలు, విద్యా నైపుణ్యాల అభివృద్ధిపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించనున్నారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల చైతన్యాన్ని కలిగించేందుకు టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని కళాశాల వర్గాలు తెలిపాయి. తల్లిదండ్రులు వీలైనంతగా హాజరై, తమ పిల్లల ప్రగతిలో భాగస్వాములు కావాలని కళాశాల తరఫున కోరారు.