కోహీర్, ఫిబ్రవరి 15: ఆలుగడ్డ పంట సాగు చేస్తున్న రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 90 రోజుల్లోనే పంట చేతికందుతుండటంతో రైతులు సంతోషంగా సాగు చేశారు. కానీ పంటకు మద్దతు ధరలేక రైతులు నష్టాలబాట పడుతున్నారు. డిసెంబర్, జనవరిలో కిలో రూ.20 వరకు ధర పలికింది. కానీ ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.8లకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
సంగారెడ్డి జిల్ల్లా కోహీర్ ప్రాంతంలో అత్యధికంగా ఆలుగడ్డ పంట సాగుచేస్తారు.కోహీర్‌తో పాటు కవేలి, దిగ్వాల్, పీచెర్యాగడి, వెంకటాపూర్, బిలాల్పూర్, మనియార్‌పల్లి, చింతల్‌ఘాట్, మద్రి, గురుజువాడ, మాచిరెడ్డి తదితర గ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు పైగా పంట సాగుచేశారు. ఆగ్రా, జలంధర్ తదితర దూర ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకువచ్చి తమ భూముల్లో నాటారు. మూడు నెలల క్రితం సాగుచేసిన రైతులు ప్రస్తుతం ఆలుగడ్డ దుంపల సేకరణలో నిమగ్నమయ్యారు. చేనులో దున్నకం చేపట్టి భూమిపైకి తేలిన ఆలుగడ్డలు సేకరిస్తున్నారు. బస్తాల్లో నింపి హైదరాబాద్, బెంగళూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అన్నదాతకు గిట్టుబాటు ధర కరువు
ఆలుగడ్డ పంట సాగు చేసేందుకు ఎకరానికి రూ. 50 వేల వరకు ఖర్చు అవుతున్నది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు, రవాణా ఖర్చులు తప్పడం లేదు. ఒక బస్తా విత్తనంతో 10నుంచి 15 బస్తాల వరకు దిగబడి వస్తున్నది. కానీ మార్కెట్లో ధర క్వింటాల్‌కు రూ. 800 నుంచి రూ. 900 పలుకుతున్నది. రైతన్నలు నష్టాల బాట పడుతున్నారు. రేగడి భూమిలో పండిన ఆలుగడ్డలు తెల్లటి రంగులో ఉంటాయి కాబట్టీ వాటి ధర రూ.10కిలో పలుకుతున్నది. రైతన్నలు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధర లేక అప్పులపాలవుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌కు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి కూడా ఆలుగడ్డ వస్తుండడంతో ఇక్కడి రైతులకు అధికంగా నష్టం జరుగుతున్నది.
రైతులు నష్టపోకుండా చూడాలి
ఐదు ఎకరాలకు పైగా ఆలుగడ్డ పంట సాగుచేశా. చేనులో ఆలుగడ్డ పంట తీసి మార్కెట్‌కు పంపిస్తున్నా. కానీ వేరే రాష్ర్టాల నుంచి వచ్చిన ఆలుగడ్డలు చాలా తెల్లగా ఉంటాయి. ఇక్కడ పండినవి కొంచెం ఎర్రగా ఉంటాయి. దీంతో ధర తక్కువగా ఉన్నది. మన ప్రాంతం పంట పూర్తిగా అయిపోయిన తర్వాతనే వేరే రాష్ట్రం పంట కొనుగోలు చేయాలి. రైతులు నష్టపోకుండా చూడాలి.
– మోహీజోద్దీన్,రైతు, కవేలి, కోహీర్ మండలం, సంగారెడ్డి జిల్లా