మెట్పల్లి : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్, రామలచ్చక్కపేట వరద కాలువ వద్ద బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటి వనరుల సమర్థ వినియోగానికి ముందుచూపుతో తీసుకున్న రివర్స్ పంపింగ్ నిర్ణయం ఫలితమే నేడు పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఒకప్పుడు ఎండిపోయి నిస్సారంగా కనిపించిన పంటపొలాలు, ఈ రోజు సాగునీరు అందడంతో పచ్చగా కళకళలాడుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా చేపట్టిన ఈ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా వరద కాలువలోకి నీటిని మళ్లించడం వల్ల నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ప్రాణాధారంగా మారిందన్నారు.
ముఖ్యంగా కోరుట్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల రైతులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సమృద్ధిగా సాగునీరు అందుతోందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా కెసీఆర్ తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలిస్తున్నాయని, ఇది ముందుచూపు నాయకత్వానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు కూడా స్పందిస్తూ, రివర్స్ పంపింగ్ వల్ల తమ పంటలకు సమయానికి నీరు అందడంతో దిగుబడులు బాగా పెరిగాయన్నారు.