కోరుట్ల, జూన్ 5: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) ప్రకటించిన అవార్డులకు కోరుట్ల బల్దియా ఎంపికైంది. హైదరాబాద్ లోగురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ‘ఉత్తమ పర్యావరణ పనితీరు’ అవార్డును అందుకుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పోల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గుగ్లావత్ రవి చేతుల మీదుగా అవార్డును కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు మహేష్ అందుకున్నారు. కోరుట్ల పట్టణ మున్సిపల్ పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ, వెహికల్ ట్రాకింగ్ సిస్టం, తడి చెత్త తో ఎరువు తయారీ, డీఆర్సీసీ సెంటర్ ద్వారా చెత్తను తడి- పొడి చెత్తగా వేరు చేసి సేంద్రీయ ఎరువు తయారీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు మున్సిపల్ ఆటోల ద్వారా సేకరించిన చెత్తను వివిధ రూపాల్లో వేరు చేసే రీసైక్లింగ్ పద్దతి విధానాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు కోరుట్ల మున్సిపాలిటీని ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డుకు ఎంపిక చేశారు.
కోరుట్ల మున్సిపాలిటీకి అవార్డు రావడంపై మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో తడి పొడి చెత్త సేకరణ, నిషేధిత ప్లాస్టిక్ నివారణలో ప్రజలు అందిస్తున్న సహకారంతోనే అవార్డు దక్కిందని తెలిపారు.