మెట్పల్లి : విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జిన్ నాగేశ్వరరావు(Justice Nageswara Rao) పేర్కొన్నారు. శనివారం మెట్పల్లి పట్టణంలోని జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుపై దృష్టి సారించాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ అమ్మినా, వాడినా శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు నేరాలకు పాల్పడవద్దని, భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కోల్పోతారని అవగాహన కల్పించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీస్ అధికారులు న్యాయవాదుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
వివేకానందుని పుస్తకాలను న్యాయమూర్తి విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఉత్తమ పోలీస్ సేవా పథకం పొందిన సీఐ నిరంజన్ రెడ్డి, ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి నాలుగవ ర్యాంకు సాధించిన గాయత్రితో పాటు ప్రిన్సిపాల్ లను న్యాయమూర్తి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు వెంకట నరసయ్య, వెంకటస్వామి, శ్రీనివాస్, ప్రవీణ్, శంకర్ రెడ్డి, శేఖర్, మానస, శ్రీలేఖ, ఎస్ఐ కిరణ్ కుమార్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు