Ramagundam Baldia | కోల్ సిటీ, ఫిబ్రవరి 10 : రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగనుంది. 1వ డివిజన్ నుంచి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఆ డివిజన్ మినహా బుధవారం 59 మంది కార్పొరేటర్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతుండగా 1,79,624 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు సిద్ధమయ్యారు.
నగర పాలక పరిధిలో 272 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో దాదాపు 45 వరకు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 60 మంది రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించగా, 272 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 272 మంది సహాయ ప్రిసైడింగ్, 816 పోలింగ్ సిబ్బంది, 60 మంది ఓట్ల లెక్కింపు అధికారులను నియమించినట్లు అదనపు కలెక్టర్ అరుణ శ్రీ వెల్లడించారు.
కాగా, మంగళవారం గోదావరిఖని శారదానగర్ లో గల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా బుధవారం ఉదయం 7 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గం.ల తర్వాత పోలింగ్ బూత్‌లోకి అనుమతించబోరనీ, ఆలోపు కేంద్రంలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.