Godavarikhani | కోల్ సిటీ, జూలై 7: రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో చెత్త సేకరణ వాహనాలపై పని చేస్తున్న మహిళా కార్మికులను డ్రైవర్లు, సూపర్వైజర్లు వేధింపులకు గురి చేస్తున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ పేర్కొన్నారు. గాంధీనగర్ లో మహిళా కార్మికులతో జరిగిన సమావేశంలో మహిళా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నగర పాలక సంస్థ పరిధిలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే వాహనాలపై మహిళా కార్మికులు చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని, డ్రైవర్లు, సూపర్వైజర్లు వారిని అగౌరవ పరిచే విధంగా మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సూటి పోటి మాటలతో కించపరుస్తున్నట్లు తెలిపారు. వీరి సమస్యలు అధికారులకు తెలిసినా సూపర్ వైజర్లకే వంత పాడుతుండడం అత్యంత బాధాకరమన్నారు. పని స్థలాల్లో మహిళా కార్మికులను వేధిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
తమ ఆరోగ్యాలను లెక్కచేయకుండా స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో మహిళా కార్మికుల త్యాగాలను గుర్తించకపోయినా వారిని నిత్యం మానసిక వేధింపులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే జూలై 3న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు మహిళా కార్మికులు పాల్గొన్నారు.