కోరుట్ల, మార్చి 11 : రైతులు నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని(New technologies వినియోగించుకొని వ్యవసాయంతోపాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, పెరటి కోళ్లు పెంపకం వంటి వాటిపై దృష్టిసారించి ఆర్థికంగా వృద్ధి సాధించాలని జాతీయ మాంస పరిశోధన, అభివృద్ధి సంస్థ డైరెక్టర్ బుర్బుద్దే అన్నారు. మంగళవారం పట్టణ శివారు పివి నరసింహారావు పశు వైద్య కళాశాలలో హైదరాబాద్ పశు వైద్య విశ్వవిద్యాలయం, జాతీయ మాంస పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన కిసాన్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుర్బుద్దె మాట్లాడుతూ రైతుల ఆదాయ వనరులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
కిసాన్ మేళా ద్వారా రైతులకు వ్యవసాయంలో సూచనలు, మెలకువలు, సాంకేతిక సలహాలు, శాస్త్ర పరిశోధన ఫలాలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నదని తెలిపారు. రైతులు వాటిని ఆకలింపు చేసుకొని సంపద పెంపొందించుకునే దిశగా ఎదగాలని పేర్కొన్నారు. అంతకుముందు పశు సంవర్ధక, ఉద్యాన, డెయిరీ, పరిశ్రమల శాఖ, నాబార్డు తదితర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ రిజిస్ట్రార్ శరత్ చంద్ర, కోరుట్ల పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్, ఎస్ఆర్ఎంఐ ప్రిన్సిపల్, సైంటిస్ట్ బస్వారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరేష్, జిల్లా పశు సంరక్షణ శాఖ అధికారి మనోహర్, పొలాస వ్యవసాయ శాస్త్రవేత్తలు స్వాతి, మధుకర్, పశు వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు రైతులు పాల్గొన్నారు.