రాయికల్, ఫిబ్రవరి 10 : రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని రైతువేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి తోటలలో ప్రస్తుతం చేపట్టే సస్య రక్షణ చర్యలపై(Mango crop protection) రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పొలాస కీటక విభాగ శాస్త్రావేత్త స్వాతి మాట్లాడుతూ తేనెమంచు పురుగు రాకుండా తయోమెతోక్సిమ్ 4గ్రాములు లేదా ఫిప్రోనిల్ 20 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ 4ml 10 లీటర్ల నీటిలో కలిపి స్పే చేయాలన్నారు. పొలాస తెగుళ్ల విభాగ శాస్త్రావెత్త బలరాం మాట్లాడుతూ.. బూడిద తెగులు ఆశిస్తే హేక్సకొనాజోలు 20 ml 10 లీటర్ల నీట్లో కలిపి స్ప్రే చేయాలని, బంక తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడే భూమిలో వేయాలని తెలిపారు. పిందెలు బఠాణి సైజు దశలో ప్లానోఫిక్స్ 2ml, 10 లీటర్ల నీటిలో కల్పి స్ప్రే చేయడం ద్వారా పిందెలు రాలడాన్ని అరికట్టవచ్చన్నారు.
చెట్లకు కంపోస్ట్, యూరియా, పోటాష్ ఎరువులు ఇవ్వాలన్నారు. పిందెలు నిమ్మకాయ సైజు దశలో 13-0-45 1KG 100 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా కాయ సైజు త్వరగా పెరుగుతుందన్నారు. పిందె దశలో సక్రమంగా నీటి తడులు అందించాలి. లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలన్నారు. మామిడిలో కోత అనంతరం జనుము లేదా జీలుగ వేసి దున్నినట్లయితే భూమి సారం పెరుగుతుందని, పూత దశలో తేనెటీగల పెంపకం కూడా చేబడితే అధిక శాతం పిందెలు కడతాయని తెలిపారు. కొత్తగా పండ్ల తోటలు పెట్టె రైతులకు మామిడి, జామ, నిమ్మ, బొప్పాయి, అరటి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలకు MIDH పథకం ద్వారా రాయితీ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం భూపతిపూర్ గ్రామంలోని మామిడి తోటలను, ఆలూరు గ్రామంలోని పుచ్చ తోటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, డ్రిప్ కంపెనీ ప్రతినిధి తిరుపతి, రైతులు పాల్గొన్నారు.