Varalakshmi Vratham | మారుతీనగర్, ఆగస్టు 8 : పండగైనా ఇంట్లో వేడుకైనా దైవ దర్శనానికి భక్తులు తమ ఇష్టమైన ఆరాధ్య దేవుళ్లకు కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఈ శ్రావణమాసంలో ప్రతీ శుభకార్యానికి మంచి పనికైనా ముందుగా కొబ్బరికాయలు కొట్టడం సాంప్రదాయం. ప్రస్తుతం మొక్కులను తీర్చాలంటే భక్తులకు బారంగా మారుతోంది.
శివుడికి ప్రీతిప్రదమైన శ్రావణమాసం కావడం, వరలక్ష్మి, రాఖీపౌర్ణమి, వినాయక చవితి నవరాత్సోత్సవాలు ఉండడంతో కొబ్బరికాయ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. రూ.20 ఉన్న కొబ్బరికాయ ప్రస్తుతం దాదాపు రెట్టింపు దిశగా అడుగులేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కొబ్బరికాయలు దిగుమతి అవుతుండడంతో హోల్ సేల్లో రూ.25 ఉండగా ఆలయాల సమీపంలో, కాలనీల్లో కిరాణ దుకాణాల్లో రూ.30కి విక్రయిస్తున్నారు.
పూలు.. పండ్లకు డిమాండ్..!
శ్రావణ శుక్రవారం అందులో వరలక్ష్మివ్రతం కావడంతో మార్కెట్లో పూలు, పండ్లకు భలే డిమాండ్. ఇదే పండగ పూట అంటూ వ్యాపారులు, పూలు పండ్ల ధరలను అమాంతంగా పెంచేశారు. మామూలు రోజుల్లో పూలు ఒక మూర రూ.30 ఉండగా అంతంగా రూ.50కి విక్రయించారు. మల్లెపూలైతే రూ.80. ఈ ధరలతో బెంబేలెత్తిన మహిళలు విడిపూల వైపు మొగ్గుచూపుతున్నారు.