మల్యాల, జూన్ 03 : జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానానికి మంగళవారం వేకువజామున నుండి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటలు పడుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు ఆలయంలోని సామూహిక వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతాలు, ఆంజనేయస్వామికి అభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజ, హారతి తదితర పూజాది కార్యక్రమాలను భక్తులు చేపట్టారు.
అంజన్న ఆలయానికి మధ్యాహ్నం వరకు సుమారు 25 వేల మంది రాగా 10 లక్షల పై చీలుకు ఆదాయం సమకూరనున్నట్లు ఆలయ అధికార వర్గాలు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీకాంత్ రావు, ఆలయ పర్యవేక్షకులు సునీల్ గౌడ్, నీలా చంద్రశేఖర్, పోలీస్ శాఖ ఏఎస్ఐ చిలుక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.