Namaste Telangana Effect | పెద్దపల్లి, జూన్ 12(నమస్తే తెలంగాణ): కధంబాపూర్ గ్రామానికి ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇరవై రోజులుగా మంచినీటి సమస్యతో సతమతమవుతున్న కధంబాపూర్ ప్రజల గోసను నమస్తే తెలంగాణ ‘మంచినీళ్లు మహాప్రభో!’ అని ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షం వెంటనే స్పందించారు. దీంతో ఎంపీడీఓ దివ్యదర్శన్‌రావు, ఎంపీఓ సమ్మిరెడ్డిల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి వినోద్‌కృష్ణ, వాటర్ గ్రిడ్ ఏఈ సూర్యతేజ, ఏఈ ఇంట్రా శ్రీకాంత్‌లు కధంబాపూర్లో నీటికి కటకట చెందుతున్న ప్రజల గోస తీర్చేందుకు నడుం బిగించారు. ఇంటిటికీ మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నా నీళ్లు సంపూర్ణంగా రాకపోవడానికి గల అడ్డంకులను గుర్తించారు.
కొంత మంది పైప్లైన్లకు అక్రమంగా మోటార్లను బిగించి నీళ్లను పంపింగ్ చేస్తుండటం, నల్లా కనెక్షన్ల వద్ద ఫ్లోకంట్రోల్ లాక్(ఎఫ్‌సీఎల్)లను తొలగించడం వల్ల వారికి మాత్రమే అత్యధికంగా నీళ్లు వస్తుండటాన్ని గుర్తించారు. ఇప్పటికిప్పుడు మోటార్లను తొలగించడంతో సమస్య కొంత పరిష్కారం అయ్యింది. అదే విధంగా కరీంనగర్‌ను ఎఫ్సీఎల్లను తెప్పించి గ్రామంలోని అన్ని మిషన్ భగీరథ కనెక్షన్లకు బిగించనున్నట్లు తెలిపారు. అయితే గ్రామంలో ప్రజలు నేరుగా మానేరు నుంచి ఏర్పాటు చేసిన రక్షిత నీటి పథకానికి సంబంధించిన నీటి వినియోగానికి అలవాటు పడ్డారని, అయితే ప్రతీ వర్షాలంలో వాటిని తొలగిస్తామని, మరి కొద్ది రోజుల్లో భారీ వర్షాల నేపధ్యంలో ఇప్పుడు దానికి మరమ్మత్తులు చేయించినా వర్షాకాలం ముగిసే వరకు పక్కన పెట్టడమేనని వారు తెలిపారు.
అయితే వర్షాకాలం పూర్తయ్యే వరకు మిషన్ భగీరథ ద్వారానే ప్రతీ ఇంటికి 400ల లీటర్లు అందే విధంగా చర్యలు చేపడుతున్నామని వారు తెలిపారు. కధంబాపూర్, ఖాసింపల్లి, గొల్లపల్లిల్లో ప్రజలు ఎవరూ మోటార్లు బిగించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని వారు పేర్కొన్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
తమ గ్రామంలోని మంచినీటి, తాగు నీటి సమస్య పరిష్కారం కోసం ‘నమస్తే తెలంగాణ’ వార్తా కథనాన్ని ప్రచురించి తమ గోసను కండ్లకు కట్టడం వల్లే తమ సమస్య పరిష్కారం అయ్యిందని మూడు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో మోటర్లు ఉన్న సంగతి తమకు తెలిసినా తాము అక్కడికి వెళ్లి వాటిని తొలగించలేమని, వార్తా కథనం వల్లే పంచాయతీ అధికారులు వాటిని తొలగించారని, లాక్‌ల సమస్య కూడా తీరనున్నదని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో అధనంగా రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసినా చివరికి తమకు మిషన్ భగీరథే దిక్కయ్యిందని సంతోశం వ్యక్తం చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌కు, నమస్తే తెలంగాణకు వారు కృతజ్ఞతలు తెలిపారు.