జగిత్యాల, మార్చి 21 : దళిత యువతలో వృత్తి నైపుణ్యాలను గుర్తించి 2020-21 గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల ఇంటర్వ్యూ లలో అర్హత పొందిన యువతకు ప్రభుత్వం బ్యాంకులలో సబ్సిడీ రుణాల మంజూరు చెక్లు వేశారు. కానీ, నిధులు విడుదల చేయలేదని నాలుగేళ్ల నిరీక్షణలో అర్హులైన యువతకు నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టిఎవైఎస్ కార్యాలయంలో టిఎవైఎస్ జిల్లా అధ్యక్షులు కొంగర పవన్, టిపిఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ కార్పొరేషన్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన యువత రుణాలు మంజూరు అవుతాయని గంపెడు ఆశతో అప్పులు చేసి బ్యాంకులలో డిపాజిట్లు చేశారన్నారు. ఇప్పటికి వడ్డీలు కడుతున్నారని జగిత్యాల జిల్లాలోనే దాదాపు నూట యాబై మంది అర్హులు ఉన్నారన్నారు. ఇకనైనా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తారనే భరోసాలో వున్న యువతకు ప్రభుత్వం ఈ మధ్యనే రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకం ప్రారంభించడంతో ఇన్నాళ్లుగా నిధుల మంజూరుకై నిరీక్షించిన యువతలో నిరాశే మిగిలిందన్నారు. కనీసం వారికి రాజీవ్ యువ వికాస్ లోనైన మొదటి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.