Car Accedent | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 20: అప్పటిదాకా ఆడుకుంటూ అందరినీ అలరించిన ఆ చిన్నారి ని రోడ్ పై వెళ్తున్న కారు మృత్యువు రూపం లో చిదిమేసిన ఘటన నగర శివారులోని గంగానగర్ లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీస్ ల కథనం ప్రకారం.. ముత్తారం మండలంలోని మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేష్ కొండగట్టు జే ఎన్ టీ యు లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు.
కాగా అతనికి గంగానగర్ కు చెందిన సంధ్య తో వివాహం కాగా వీరికి 3 సంవత్సరాల పులిపాక శివరాజ్ కుమార్ కుమారుడు ఉన్నాడు. అయితే వీరికి రెండో సంతానం గా పాప జన్మించి 3 నెలలు గడుస్తుంది. రెండో కాన్పుకోసం తల్లిగారింటికి శివరాజ్ కుమార్ తో సహా తల్లి సంధ్య వచ్చి ఉంటుంది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్ కుమార్ అప్పటిదాకా ఆడుకుంటూ ఉన్నాడు.
ఒక్కసారిగా రోడ్ పైకి రావడం మంచిర్యాల్ వైపు నుంచి గంగానగర్ కు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. గమనించిన బంధువులు హుటాహుటిన చికిత్స నిమిత్తం పట్టణంలోని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు. కాగా మృతుడి తండ్రి పులిపాక రమేష్ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన గంగానగర్ కు చెందిన కారు డ్రైవర్ ఎం వెంకటేశ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్సై భూమేష్ తెలిపారు.