Gulf Fraud | ధర్మపురి, ఆగస్టు 14 : విదేశీ ఉపాధిపై మోజుతో ఎందరో వలస జీవులు అక్కడి వెళ్లి మోసపోయి చేయని నేరానికి బిక్కుబిక్కుమంటూ జైళ్లలో మగ్గుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువయ్యో.. బతుకు భారమయ్యో.. నాలుగు కాసులు వెనకేసుకుందామనో.. చాలా మంది అప్పో సప్పో చేసి ఏజెంట్లను సొమ్ములు సమర్పించుకొని రెక్కలు కట్టుకొని కోటి ఆశలతో రివ్వుమంటూ గల్ఫ్ దేశాలకు వెలుతున్నారు.
కార్మికులకు ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా అమాయకత్వం లేదా అత్యాశ వల్ల మోసపోయే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు, ఏపీకి చెందిన ముగ్గురు.. మొత్తం 9 మంది దుబాయ్‌లో ఒక ముఠా చేతిలో మోసానికి గురై పోలీస్ కేసులో ఇరుక్కున్న సంఘటన ఇది.
జగిత్యాల జిల్లా ఎండవల్లి మండల కేంద్రానికి చెందిన మంతెన కిరణ్ అనే యువకుడు సహాయం కోసం దుబాయ్ నుండి ఒక సెల్ఫీ వీడియోను తీసి తన స్నేహితులకు, ఎండపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైరేందర్ రెడ్డికి పంపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కిరణ్‌తోపాటు ఏపీ వ్యక్తిని చేయని నేరానికి పోలీసులు రెండు రోజులు విచారించి విడిచిపెట్టారు. మిగిలిన ఏడుగురు పోలీసులు అదుపులోనే ఉన్నట్టుగా కిరణ్ ఫెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. కిరణ్ ప్రస్తుతం దుబాయిలోని జేబలాలి ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్టుగా వీడియో ద్వారా తెలిపాడు.
బాధితులు కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కిరణ్ , మరో 8 మంది దుబాయ్‌లోని గ్రీన్ స్కేచ్ ఎల్ఎల్సీ కంపెనీలో 2025 ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరారు. తొమ్మిది మంది కలిసి పని చేసుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి వీరికి పరిచయమయ్యాడు. వేరే కంపనీలో చేరితే ఎక్కువ జీతం వస్తుందని ఆశ కల్పించాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన ఈ తొమ్మిది మంది ఆ వ్యక్తితో ఓ ప్రదేశానికి వెళ్లారు. అయితే ఆక్కడికి వెళ్లిన తర్వాత వీరి వద్దనుండి ముఠా సభ్యులు వీరి ఐడీ కార్డులు లాక్కొని నిర్బంధించారు. వీరిని ఈ ముఠా 15 రోజులు నిర్భందంలో ఉంచింది. వారి ఐడీ కార్డులతోపాటు సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకున్నారు. ముఠా వీరితో సంతకాలు, ఫోటోలు తీసుకున్నారు. ఆగస్టు 5న వీరిని విడిచిపెట్టగా.. అనుమానస్పద స్థితిలో ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోన్లు కూడా తీసుకొని ఆర్థిక మోసాలు..!
పోలీసులు రెండు రోజులు విచారించి కిరణ్‌తోపాటు ఏపీ వ్యక్తి వాసును విడిచిపెట్టారు. అయితే ముఠా సభ్యులు వీరి వద్దనుండి ఐడికార్డులు, బ్యాంకుఖాతాల వివరాలు తీసుకొని వీటి ద్వారా అక్కడ లోన్లు కూడా తీసుకొని ఆర్థిక మోసాలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కిరణ్, ఏపీ వ్యక్తి వాసు వీరిద్దరు వారు పనిచేసిన కంపనీ గ్రీన్ స్కేచ్ఎల్ఎల్సీకి వెళ్లి క్షమాపణ కోరగా యాజమాన్యం నిరాకరించింది. ప్రస్తుతం వీరిద్దరు దుబాయిలోని జేబలాని ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్టుగా వీడియా ద్వారా తనిస్తారు.
ఎండవెల్లికి చెందిన కిరణ్, ఏపీకి చెందిన వాసులను పోలీసులు విడిచిపెట్టగా.. మిగతా ఏడుగురు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. వీరిలో జగిత్యాల జిల్లా వెల్లటూర్ మండలం జైనపేటకు చెందిన మధు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వినయ్, రాజు, శ్రీకాంత్ నిర్మల్ జిల్లాకు చెందిన డోగల ఆశోక్, ఏపీకి చెందిన మరో ఇద్దరు.. మొత్తం ఏడుగురు వ్యక్తులు ఆగస్టు 5 నుంచి దుబాయ్ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం.
కాగా విషయం తెలిసిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి చొరవ చూపి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాయంతో తెలంగాణ ప్రభుత్వ పక్షాన దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.