జ్యోతినగర్, ఫిబ్రవరి 6: ‘ కాంగ్రెస్ అన్నీ అబద్ధాలే చెప్పింది. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెట్టింది. ఆచరణ సాధ్యంకాని ‘420’ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వ పాలన రాక్షస పాలనను తలపిస్తుది. 50 రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని’ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఎన్టీపీసీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చి, మాట్లాడారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి సెగ్మెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకువచ్చిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
పదేండ్ల పాలనలోనే తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. మంత్రులు బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రాజెక్టు మొత్తానికే మొత్తం కూలిపోయిందని ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడితే తప్పుకాదు కానీ, మాటకు మాట సమాధానం చెప్పిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ టైంలో చంద్రబాబు చంకలో ఉండి రైఫిల్‌తో తిరిగిన చరిత్ర రేవంత్‌రెడ్డిది అని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ కొత్త మెలిక పెడుతున్నారని, రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు గెలిపిస్తేనే గ్యారంటీలు అమలవుతాయని, కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్‌రెడ్డి రాజకీయం చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను కించపరిచినట్లేనన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని, ప్రజలకు కనీస మౌలిక వసతులు అందడం లేదన్నారు. పింఛన్లు, రైతుబంధు, సాగునీరు ఇవ్వడం లేదని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడుతున్నదని చెప్పారు. పార్టీ శ్రేణులంతా ప్రజల పక్షాన నిలబడి చైతన్యవంతం చేయాలని, ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటాలని సూచించారు.
ఇక్కడ రామగుండం మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు కృష్ణవేణి, రమణారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు మూల విజయారెడ్డి, పీటీ స్వామి, జేవీ రాజు, తోడేటి శంకర్‌గౌడ్, అచ్చెవేణు, గోపు ఐలయ్య యాదవ్, తిరుపతి నాయక్, మెట్టుపల్లి అనిల్‌రావు, వీరాలాల్, ఈదునూరి పర్వతాలు, తోకల రమేశ్ ఉన్నారు. కాగా, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చందర్ సమక్షంలో సమావేశం ఖండించింది. కేసీఆర్‌కు రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తీర్మానించింది.
గులాబీ జెండాను ఎగురవేయాలి
కాంగ్రెస్ 420 హామీలతో గద్దెనెక్కింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడంలో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. మన తెలంగాణ ప్రజల కోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం. ఆనాడు తెలంగాణ కోసం ఎలాగైతో కొట్లాడామో.. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరేదాకా పోరాడుదాం. మన సత్తా ఏంటో చూపిద్దాం.
– పుట్ట మధూకర్, జడ్పీ చైర్మన్
కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
కొట్లాడి సాధించిన రాష్ర్టాన్ని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దారు. రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన మహనీయుడిపై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. వెంటనే తెలంగాణ సమాజానికి, కేసీఆర్‌కు రేవంత్ క్షమాపణ చెప్పాలి. లేకపోతే రేవంత్‌రెడ్డిని రాష్ట్రంలో ఏ ఊరిలోకి రాకుండా అడ్డుకుంటాం. క్షమాపణలు చెప్పేదాకా నిరసన చేపడుతాం.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే