కరీంనగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా జరుగుతున్న భ్రూణహత్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కొంత కాలంగా ఆధునిక పరికరాలతో అడ్డగోలు అబార్షన్లు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ బాగోతం బట్టబయలు కాగా, ఇదే విషయాన్ని ‘చిదిమేసింది ఎవరు?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దీంతో మొత్తం యంత్రాంగమే కదిలింది. హుస్నాబాద్ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించగా, విచారణలో అనేక అంశాలు వెలుగుచూస్తున్నట్టు తెలుస్తున్నది.
ప్రధానంగా హుజూరాబాద్‌లోని మాధవి నర్సింగ్‌హోంలోనే యువతికి అబార్షన్ జరిగినట్టు నిర్ధారించి ఎఫ్ఐఆర్లో నమోదు చేయడమే కాకుండా సదరు దవాఖాన నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అబార్షన్ల విషయంలో ఈ ప్రాంతంలో పనిచేసే ఓ ప్రభుత్వ వైద్యురాలు కీలక పాత్ర పోషిస్తుండగా.. ఒక ఆర్ఎంపీ, ఒక నర్సు కూడా ప్రధాన సూత్రదారులుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఒక యువతి అబార్షన్ మాత్రమే వెలుగులోకి వచ్చినా.. జమ్మికుంట, హుజూరాబాద్‌లోని పలు వైద్యశాల్లో దందా యథేచ్ఛగా నడుస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూపీ లాగితే డొంకంతా కదులుతుండగా, జిల్లా వైద్యారోగ్యశాఖ మాత్రం మొద్దు నిద్ర పోతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలే కేంద్రాలుగా జరుగుతున్న భ్రూణహత్యలు, హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు, గతంలో జరిగిన అరెస్టులు వంటి అంశాలను కండ్లకు కట్టినట్టుగా ‘చిదిమేసింది ఎవరు?’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం కథనం ప్రచురించింది. దీనిపై ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగినా.. అసలు సూత్రదారులెవరో తేల్చి, ఈ దందాకు అడ్డుకట్టవేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. దీనిపై స్పందించిన హుస్నాబాద్ పోలీసులు, స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. సూత్రదారులను పట్టుకోవడంతోపాటు పూర్తిగా కూపీ లాగేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్టు విశ్వసనీయ సమాచారం. వీరి విచారణలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తున్నది.
నిజానికి ఇది ఒకటి రెండు రోజులుగా నడస్తున్నది కాదని, కొన్నేళ్లుగా ఈ దందాలకు పాల్పడుతున్నట్టుగా సదరు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదు ప్రకారం చూస్తే.. ఓ ప్రభుత్వ వైద్యురాలు కీలక పాత్ర పోషించినట్టు, ఆమె ఇదే ప్రాంతంలో పనిచేయడంతోపాటు ప్రధానంగా అబార్షన్లు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఆమెకు ఒకరిద్దరు నర్సులు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఆ మేరకు యువతి అబార్షన్ ప్రక్రియ హుజూరాబాద్‌లోని మాధవినర్సింగ్ హోంలోనే జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఎఫ్ఐఆర్లో ఈ నర్సింగ్‌హోం పేరును కూడా చేర్చారు. ప్రస్తుతం ఈ నర్సింగ్‌హోంను నడుపుతున్నదెవరు? ఇప్పటివరకు ఎన్ని భ్రూణహత్యలు చేశారు? అందులో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నదెవరు? అబార్షన్లు చేస్తున్నదెవరు? ఎంతకాలంగా ఈ దందా నడుస్తున్నది? అబార్షన్లకు ఎటువంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు? ఇలా అన్ని కోణాల్లో విచారణ చేస్తుండగా, పలు ఆసక్తికర ఆంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తున్నది. అబార్షన్లకు అధునాతన పరికరాలను వినియోగిస్తున్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో దవాఖాన నిర్వాహకులతోపాటు అబార్షన్‌లో కీలకపాత్ర పోషించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు అన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో మరింత లోతుగా వెళ్తే చాలా మంది బాగోతం బట్టబయలుకానున్నది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముందుకెళ్తుండగా.. స్థానికంగా ఉండే కొంతమంది పోలీసులు సహకరించడం లేదన్న విమర్శలు సైతం వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని హుస్నాబాద్ పోలీసులు బట్టబయలు చేస్తే.. తమ ఉద్యోగాలకు ఇబ్బందులు వచ్చే ప్రమాదముందని భావించి, ముందుకెళ్లకుండా చూస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా ప్రత్యేక పోలీస్ బృందాల మూమెంట్‌ను సైతం కొంత మంది సదరు దవాఖాన నిర్వాహకులకు ముందుగానే తెలుపుతున్నట్టు తెలిసింది. అయితే భ్రూణహత్యలకు అడ్డుకట్ట వేయాలంటే సమన్వయంతో పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో దొంగలను బయటకు లాగాలంటే స్థానిక పోలీసులు కూడా పూర్తి సహకారం అందించాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొంతమంది స్థానిక పోలీసులు.. కొంత మంది దవాఖాన నిర్వాహకులను, వైద్యులను పిలిచి, తూతూ మంత్రంగా హెచ్చరించి, తమ పని అయిందన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కక్కుర్తితో మగబిడ్డల భ్రూణహత్యలు
జమ్మికుంట, హుజూరాబాద్‌లోని పలు దవాఖానలు కాసుల కోసం ఎంతకైనా దిగజారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అబార్షన్లు చేయడంలో ఒకటికి మించి మరొకటి పోటీపడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో అబార్షన్‌కు లక్షకుపైగా దండుకుంటున్నట్టు తెలుస్తున్నది. అందులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. లింగ నిర్ధారణలో పుట్టేది మగ అని తెలిసినా ఆ విషయాన్ని దాచి, కాసుల కక్కుర్తితో కొంత మంది వైద్యులు, హాస్పిటళ్ల నిర్వాహకులు కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తప్పుడు రిపోర్టులు ఇవ్వడమే కాకుండా ఆపై భ్రూణహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది. దవాఖానల దురాశకు ఎంతో మంది బలైనట్టు తెలుస్తున్నది.
అంతేకాదు.. రెండు, మూడు నెలలైతే ఒక రేటు, నాలుగు నుంచి ఆరు నెలలైతే మరో రేటు, ఆపై అయితే లక్షల్లో గుంజుతున్నట్టు తెలిసింది. లింగనిర్ధారణతోపాటు అబార్షన్లు విచ్చలవిడిగా చేస్తుండడంతో కొంత మంది ఆర్ఎంపీలు.. వివిధ గ్రామాల నుంచి సదరు దవాఖానలకు తీసుకొచ్చి కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఓ ఇద్దరు ఆర్ఎంపీలు అయితే ఏకంగా ఇదే పనిపై ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. బాధితుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ దందాకు అడ్డూ అదుపు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న మూడు నాలుగు జిల్లాల నుంచి గర్భిణులను తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎంపీలు అబార్షన్లు చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయట పడుతున్నట్టు తెలుస్తున్నది.
నిద్రపోతున్న వైద్య ఆరోగ్యశాఖ
భ్రూణహత్యలపై చర్యలు తీసుకోవాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ నిద్రపోతున్నది. అందుకు నిదర్శనం జమ్మికుంట, హుజూరాబాద్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న అబార్షన్లే. కొద్ది నెలల క్రితం జమ్మికుంటకు చెందిన ఒక దవాఖానలో భ్రూణహత్యకు సంబంధించి అంశాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆనాటి జిల్లా వైద్యాధికారి.. సదరు దవాఖానను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ విషయంలో ఏమి జరిగిందో తెలియదు కాదు కానీ, కొన్నాళ్లకే ఆ హాస్పిటల్ తెరుచుకున్నది. దీంతో మిగిలిన దవాఖానలకు సైతం బలం చేకూరినట్టు తెలుస్తున్నది. ఏమిచేసినా ఏమి కాదులే.. డబ్బులతో వైద్యశాఖాధికారులను మేనేజ్ చేయవచ్చన్న బలమైన అభిప్రాయం ఈ ప్రాంతంలోని కొంత మంది నిర్వాహకుల్లో ఏర్పడింది. దీంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయినట్టు తెలుస్తున్నది.
ఇటు పూర్తి స్థాయిలో చర్యలు లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తున్నది. హుస్నాబాద్‌లో యువతి ఫిర్యాదు చేయడం, ఆ వ్యవహారంలో కొంతమందిని అరెస్ట్ చేయడం వంటివి జరిగిన తర్వాత కూడా వైద్య, ఆరోగ్యశాఖ సదరు దవాఖానలో తనిఖీలు నిర్వహించలేదు. కనీస చర్యలు తీసుకోలేదు. దీనిని బట్టి చూస్తే వైద్య, ఆరోగ్యశాఖ నిద్ర మత్తులో ఉందా..? లేక మాముళ్ల మత్తులో ఉందా..? అన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం తేరుకొని హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సదరు వైద్యశాలపై చర్యలు తీసుకోవడంతోపాటు మిగిలిన దవాఖానలపై నిఘా పెట్టాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.