Badibata | చిగురుమామిడి, ఏప్రిల్ 21: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ కిషన్ నాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ గుడాల రజిత ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రవేశం కోసం సోమవారం బడిబాట కార్యక్రమం ఇంటింటా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
పాఠశాలకు రూ.5 లక్షలతో తాగునీటి సౌకర్యం, మైనర్ మరమ్మత్తులు, సానిటేషన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.22 లక్షలతో పాఠశాల ప్రహరీ, కిచెన్ షెడ్, బలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు నిర్మించి విద్యార్థులకు వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినే విధంగా డైనింగ్ రూమ్ నిర్మించినట్లు చెప్పారు. ఉత్తమ ఫలితాలను విద్యార్థులు సాధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం గ్రామస్తులందరూ సహకరించాలని వారు బడిబాటలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూప, సునీత, వాణి, కదిర్ ఫా షా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.