BRS Mandal leaders | చిగురుమామిడి, సెప్టెంబర్ 10: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి రైతులకు యూరియా పంపిణీ చేయకుండా రోడ్లపైకి వెళ్లి రాస్తారోకోలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండల కేంద్రంలో వారు బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రెండు నెలలుగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ఎక్కడం హాస్యాస్పదమన్నారు.
అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పని పరిస్థితి నెలకొందన్నారు. మతతత్వ బీజేపీ రైతులను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరత లేకుండా తొమ్మిదిన్నర సంవత్సరాలు రైతులను కంటికి రెప్పలా కేసీఆర్ చూసుకున్నాడని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అగ్రవర్ణాలకు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి తో కక్షపూరితంగా బీసీ బిడ్డపై కేసు పెట్టించాడని మండిపడ్డారు.
అక్రమ కేసులకు భయపడేది లేదని, రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నెలలు గడుస్తున్న రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మిట్టపల్లి మల్లేశం, ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ సర్వర్ పాషా, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకవరం శివప్రసాద్, కత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.