కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతున్నది. కర్షకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. మొన్నటిదాకా నిరసనలతో హోరెత్తించిన రైతులు, ఇప్పుడు రైతు వేదికల సాక్షిగా కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. మూడో రోజు బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు హాజరై దిశానిర్దేశం చేస్తుండగా, 24 గంటల విద్యుత్ ఎంతలా మేలు చేస్తున్నదో చర్చించారు. గత ప్రభుత్వాల పాలనలో అనుభవించిన బాధలను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో అతీ గతి లేని కరెంట్ ఇచ్చిన నాయకులు ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితిని తేవాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు, సాగు నీరు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా పడి ఉన్నాయని, స్వరాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని, ఫలితంగా తాము పుష్కలమైన పంటలు పండించుకుని సుఖంగా బతుకుతుంటే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలచి వేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ రైతు వేదికలో జరిగిన రైతు సదస్సుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ హాజరయ్యారు. రాయికల్, బొమ్మకల్, అమ్మనగుర్తి, రాయికల్ తండా గ్రామాలను నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీణవంక మండలం చల్లూరులో జరిగిన రైతు సదస్సులో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. చల్లూరు, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎల్భాక, గంగారం గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వినూత్నంగా రైతుల వద్దకే వెళ్లి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చించారు. గంగాధర మండలం లింగంపల్లికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ పొలంలో కూలీలతో కలిసి నాట్లు వేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మహిళలు బతుకమ్మ పాటల రూపంలో పాడగా, ఎమ్మెల్యే సంబురపడ్డారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి రైతు వేదికలోజరిగిన సదస్సుకు మంత్రి కొప్పుల హాజరయ్యారు. 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేశారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని రైతు వేదికలో జరిగిన రైతు సదస్సుకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే సంజయ్ సారంగాపూర్ మండలం కోనాపూర్లోనూ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో జరిగిన సదస్సులో బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్తోపాటు పెద్దపల్లి మండలం పాలితంలోని రైతు వేదికల్లో జరిగిన రైతు సదస్సుకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పాలకుర్తి మండలం పుట్నూర్ రైతు వేదికలో పుట్నూర్, గుడిపల్లి, జయ్యారం, రామారావుపల్లి, కొత్తపల్లి, ఈసాలతక్కళ్లపల్లి గ్రామాలకు చెందిన రైతులతో ఏర్పాటు చేసిన సదస్సుకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. ముత్తారంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య పాల్గొని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
రేవంత్ ఓ మాయల ఫకీర్
దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ఏనాడూ ప్రజల బాధలు గురించి ఆలోచన చేయలేదు. వాళ్ల పాలనలో సాగుకు సరిపడా కరెంట్, సాగునీరు ఇవ్వలేదు. రైతులు అనేక కష్టాలు పడ్డా పట్టించుకోలేదు. అర్ధరాత్రి కరెంటుతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సీఎం కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఇస్తున్న 24 గంటల కరెంటుతో రైతులు తమకు వీలున్నప్పుడే వెళ్లి మోటర్ పెట్టుకుంటున్నారు. రాత్రిపూట ప్రశాంతంగా కుటుంబంతో నిద్రపోయే పరిస్థితులు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ మాయమాటలతో రైతులను మోసం చేయాలని చూస్తున్నది. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. మాయల ఫకీర్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు ఎందుకు? 3 గంటలు చాలని మాట్లాడుతున్నడు. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి. రైతులకు క్షమాపణ చెప్పాలి.
-కాసర్ల అనంతరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ (పెద్దపల్లి)
రైతులపై ఇన్ని కుట్రలా..?
నాటి కష్టాలను దూరం చేసుకొని సీఎం కేసీఆర్ పాలనలో సంతోషంగా ఎవుసం చేసుకుంటున్న రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కడుపుమంట. ఉచిత విద్యుత్‌పై ఇన్ని రాజకీయాలా..? ఇన్ని కుట్రల్రా..? రేవంత్‌రెడ్డి శనిలా దాపురించిండు. మా కడుపుకొడితే ఏమోస్తదే..? రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రైతులం సంతోషంగా ఉన్నాం. కలలో కూడా పంటలు ఏసినప్పుడు సాగు ఖర్చుల కోసం సర్కారే డబ్బులు ఇస్తుందని అనుకోలేదు. కానీ రైతు బంధు కింద ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్రు. ఇది నిజంగా మాకు ఎంతో ఆసరా అవుతుంది. నీళ్లున్నా గతంలో కరెంటు ఉండేది కాదు. ఎప్పుడస్తుందో..? ఎప్పుడు పోతుందే ఎవరికి ఎరుకయ్యేది కాదు. తొమ్మిదేండ్లలో కరెంటు ఫుల్‌గా ఉంది. పంటలకు సమయానికి నీటి తడి పెడ్తున్నం.
– మాదం భూమన్న, రైతు (గోదూర్)
కరెంట్ వద్దన్న కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్
తెలంగాణ రాకముందు రైతులు అరిగోస పడ్డరు. కరెంట్ ఎప్పుడత్తదో తెల్వక అన్ని పనులు బంద్‌పెట్టి రాత్రనక, పగలనక పొలాల పొంటి తిరిగేటోళ్లం. లోవోల్టేజీ కరెంట్‌తో మోటర్లు కాలిపోయేది. సగంలనే పంటలు ఎండిపోయేది. తెచ్చిన అప్పులు తీరక అరిగోసపడేది. సీఎం కేసీఆర్ సారుకు రైతుల కష్టాలు తెలుసు. అందుకే అడగక ముందు 24 గంటల కరెంట్ ఇత్తున్నడు. ఇప్పుడు కరెంట్ పోవుడు లేదు. మోటర్లు కాలుడులేదు. గుంట భూమికూడా ఖాళీ లేకుండా సాగు చేసినం. ఇబ్బందిలేకుండా రెండు పంటలు పండించుకుంటున్నం. రేవంత్‌రెడ్డి అట్టిగనే నోరు పారేసుకుంటే మంచిగుండదు. కరెంట్ వద్దన్న కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్, అడ్డదిడ్డం మాట్లాడితే ఊర్లల్లోకి రానియ్యం.
– రామిడి సంపత్‌రెడ్డి, రైతు చల్లూరు (వీణవంక)
మా కష్టాలు రేవంత్కేం తెలుసు..
2014 కంటె ముందు ఎవుసం జేస్తే దండుగనెటోళ్లు. గతంల కరెంట్ కోసం అరిగోసపడ్డం. ఎక్కువ తక్కువ వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయేది. తెలంగాణ అచ్చినంక పరిస్థితి మారింది. 24 గంటల కరెంట్ ఉంటున్నది. సాగునీరుకు ఢోకాలేకుండా పోయింది. సీఎం కేసీఆర్‌తోనే ఎవుసం పండుగైంది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎవుసానికి 3గంటల కరెంట్ సాలు అని అడ్డంపొడుగు మాట్లాడుతున్నడు. పొరపాటున కాంగ్రెస్ వస్తే రైతులకు చీకటి రోజులే. ఎవుసం బందుజేసి మళ్లా కూలీ పనులకు పోవుడయితది. రైతులను లాఠీలతో కొట్టిచ్చి, అరిగోసవెట్టుకున్న చంద్రబాబుతో తిరిగినోనికి రైతుల బాధలు ఎట్లా తెలుస్తయి. చులకనగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
– మ్యాకల సత్యనారాయణరెడ్డి, రైతు (మామిడాలపల్లి)
కరెంట్ కష్టాలు మళ్లీ రావద్దు
గతంల కాంగ్రెస్ ఉన్నప్పుడు సాగుకు కరెంట్‌లేక మస్తు కష్టాలు పడ్డం. ఎప్పుడు వత్తదో ఎప్పుడు పోతదో తెల్వకపోతుండె. తెల్లందాక పొలాల గట్లపై పడుకునేది. అయినా సరిపడా కరెంట్ రాక పంటలు ఎండిపోతుండె. పెట్టుబడులు ఎల్లక అప్పులపాలై ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నరు. కానీ, సీఎం కేసీఆర్ వచ్చినంక రైతులకు మంచిరోలచ్చినయి. పంటలకు సరిపడా కరెంట్ ఇత్తున్నడు. పుష్కలంగా సాగునీరు అందుతున్నది. పంట పెట్టుబడికి రైతుబంధు టైంకు ఖాతాలో పడుతున్నది. ఇప్పుడు రైతులమందరం సంతోషంగా ఉన్నం. ఇసొంటి సమయంల కాంగ్రెసోళ్లు రైతులను ముంచాలని చుస్తున్నరు. ఆ కరెంట్ కష్టాలు మళ్లీ రావద్దు. వాళ్లను నమ్మద్దు.
– మెండె ఓదెలు, రైతు, కీచులాటపల్లి (జూలపల్లి )
తరిమేసే రోజులు వస్తయ్
గతంలో కరెంటు ఎప్పుడు వచ్చేదో పోయేదో తెల్వని పరిస్థితి ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పొలం కాడికిపోయేది. ఇప్పుడా కష్టాలు లేవు. కేసీఆర్ సర్కారు సాగకు 24గంటల కరెంట్ ఇస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా సాగునీరు సరఫరా చేస్తున్నది. ఇది ఓర్వలేకే రేవంత్‌రెడ్డి కుట్రలు పెట్టాలని చూస్తున్నడు. 3 గంటల కరెంటు చాలని అంటున్నడు. ఇట్ల మాట్లాడితే రైతులెవరూ ఊరుకోరు. ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. రైతులను అరిగిస పెట్టిన కాంగ్రెసోళ్లు గ్రామాల్లోకివస్తే తరిమేసే రోజులు వస్తయి. అంది ఎంతో దూరంలో లేదు.
– వేమునూరి రమేశ్‌చారి, రైతు
కేసీఆర్‌ను కాదంటే తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టె
నాకు ఇప్పుడు 70 ఏండ్లు దాటినయి. ఎవుసం చేసుకుంట బతుకుతున్న. ఎందరో వచ్చిన్రు. ఏమో జేత్తం అన్నరు. ఏం జెప్పినా ఏం జేసినా రైతు గోడును ఎవలూ పట్టించుకోలె. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు ఉన్న ప్రభుత్వాలను చూసిన రైతుల గోస దేవుడికెరుక. పొలంకాడ మోటర్ ఏసినంక గంట కూడా పోయకముందే కరెంటు పోతుండె. మళ్ల ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెల్వకపోతుండె. పంట పండించే రైతు ఆగమైతుండె. ఒక్క మడి పారక ముందె కరెంటు పోతుండె. మళ్ల కరెంటు వస్తే అదే మడి పారుతుండె. కంటి మీద నిద్ర ఉండేది కాదు. రాత్రి పూట కరెంటుతో చాలా మంది రైతులు చనిపోయిన్రు. పాపం పిల్లజెల్లలతో రోడ్డున పడ్డ వాళ్ల కుటుంబాలను చూసి బాధ పడేవాళ్లం. అలాంటిది సీఎం కేసీఆర్ దయ వల్ల రైతుల బతుకులు మారినయి. ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు వల్ల రైతు కుటంబాల జీవితాల్లో నిండుతున్నయి. మేం సంతోషంగా ఉండుడు కాంగ్రెసోళ్లకు నచ్చుతలేదు. అందుకే కుట్రలు చేస్తున్నరు. వాళ్ల పాలనలో రైతులకు ఏం చేయలె. మేం ఏం లాభపడలె. గని ఇప్పుడు ఏదో చేత్తమని మభ్యపెడుతున్రు. మళ్ల రైతులను నిండముంచుతరు. అందుకే కేసీఆర్ సారే మళ్ల రావాలె. ముఖ్యమంత్రి కావాలె. తిన్న రేవు తలువనోళ్లకు పుట్ట గతులుండయి. ఇంతగొప్పగా జేస్తున్న కేసీఆర్‌ను కాదంటే తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లే. -బండారి మల్లయ్య, రైతు, నిమ్మనపల్లి (పెద్దపల్లి)
రేవంత్‌ను తరిమికొడతం
కాంగ్రెస్ పాలనలో మా బతుకులు ఎట్ల ఉన్నయో.. తలుచుకుంటేనే దుఃఖమస్తది. కరెంట్ లేక, నీళ్లు రాక, ఎరువులు అందక ఎవుసమే ఆగమైపోయింది. రైతు అంటేనే చిన్నచూపు ఉంటుండె. తెలంగాణ వచ్చిన తర్వాతనే మాకు మంచి రోజులు వచ్చినయి. ఫుల్‌గా కరెంటు ఇవ్వడమే కాదు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. గతంతో పోల్చితే ఇప్పుడు రైతుకు కరెంటు సమస్య అనేదే లేదు. ఎప్పడంటే అప్పుడు కరెంటు ఉంటుంది. రైతు బంధుతో పంట సాగుకు అవసరమైన ఖర్చుల కోసం డబ్బుల రందీ లేదు. ఎరువులు సమయానికి సరపడా అందుబాటులో దొరుకుతున్నాయి. చేతికి వచ్చిన పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లిస్తుంది. రైతుల మేలు కోరే ఇసోంటి గవర్నమెంట్‌కే మా మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాటకాలు మా దగ్గర సాగయి. మళ్లీ మా రైతుల పడ్డదట.. వాళ్ల పాలనలో మాకేం మంచికాలె. ఇప్పుడు మంచిగ బతుకుతుంటే ఓర్తలేరు. రేవంత్‌రెడ్డి మూడు గంటలు చాలని అంటున్నడట. మేం బాగుపడద్దా.. కాంగ్రెసోళ్లకు ఒకటే చెబుతున్నాం. మీరు మా రైతుల దగ్గరికి వస్తే తరిమితరిమి కొడతాం.
– రాజేశుని లింగన్న, రైతు, తిమ్మాపూర్
నాటి గోస రావద్దు
కాంగ్రెస్ పాలనలో రైతులు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. కరెంట్ కోసమైతే అరిగోస పడ్డం. కంటినిండా నిద్ర పోకుండా జాగారం చేసేటోళ్లం. రాత్రిళ్లు పొలాల దగ్గర పాములు, తేళ్లు కుట్టి ఎంతో మంది చనిపోయిన్రు. కరెంట్ షాకుతోనూ పాణం ఇడిసిన్రు. నాటి గోస మళ్లీ రావద్దు. తెలంగాణ ప్రభుత్వం అచ్చినంక మా తిప్పలు తప్పినయి. ఎప్పడంటే అప్పుడే కరెంట్ వాడుకుంటున్న. సీఎం కేసీఆర్ సార్ మాకు ధీమాగా ఉన్నడు. ఇప్పడే మంచిగుంది. మళ్లీ మూడు గంటలు అంటే నాటి రోజులు వస్తయి.
– అర్ధవేని పెద్దులు, రైతు (కోనాపూర్)
ఓర్వలేకే కుట్రలు చేస్తున్రు
మేం ఏళ్ల తరబడి భూములు కౌలుకు పట్టుకుంటున్నం. గతంలో కరెంటు లేక, పెట్టుబడి ఎల్లక, కౌలుమీదపడి, నానా తిప్పలు పడ్డం. ఇప్పుడు పుష్కలంగా, కరెంటు, నీళ్లు అందుబాటులో ఉండటంతో పంటలు మంచిగ పండుతున్నయి. కాంగ్రెస్ నాయకులకు రైతులు బాగుపడడం ఇష్టం లేదు. ఓర్వలేక కుట్రలు చేస్తున్రు. 3 గంటల కరెంటు చాలు అంటున్రు. కాంగ్రెస్ పాలనలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నరు. కానీ తెలంగాణలో సంతోషంగా ఉన్నరు.
– తిరుపతమ్మ కౌలురైతు జయ్యారం (పాలకుర్తి)
మూడు గంటల ఎట్ల సాల్తది?
కాంగ్రెస్ హయాంల కరెంట్ ఎప్పుడు ఉండేదో..? ఎప్పుడు పోయేదో తెలియకుండె. దీంతో మస్తు తిప్పలు పడ్డం. ఎవుసానికి కరెంట్ వెట్టేందుకు రాత్రి 12, ఒంటి గంటకు కూడా పోయేటోన్ని. ఏదైనా శుభకార్యానికి సుట్టపోల్లింటికి పోతే వచ్చేసరికి పొలం ఎండిపోయేది. గతంల బావి తవ్విస్తే రూ.లక్ష దాకా అయ్యేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడం, కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిని నింపడంతో మస్తు నీళ్లున్నయ. 24గంటల కరెంట్ ఇచ్చేపటికె రాత్రిళ్లు పొలాలకాడికి పోయే తిప్పలు తప్పినయి. రాత్రిళ్లు ఇంట్లోనే ఉంటూ సంతోషంగా ఎవుసం జేసుకుంటున్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్ సాలంటున్నడు. ఎవుసానికి మూడు గంటల ఎట్ల సాల్తది..? ఆయనకేం తెలుసు. ఎవుసం చేస్తే తెలుస్తది.
– కొడిపెల్లి రాములు, రైతు (తిమ్మాపూర్)
కాంగ్రెస్‌కు బుద్ధిచెబుతం
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినంకనే రైతు రాజైండు.. సాగుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బందిలేకుంట పంటలు పండించుకుంటున్నం. రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎక్కడన్నా ఉచిత కరెంట్ ఇస్తున్నారో చెప్పాలి. కేసీఆర్‌లాగా రైతుల గురించి ఆలోచించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడూ లేరు. వారికి ఓటుతోనే బుద్ధిచెబుతాం. ఊర్లకు వస్తే తరిమికొడుతాం.
– చొప్పదండి భూమయ్య రైతు (పాలకుర్తి)
రేవంత్ క్షమాపణ చెప్పాలి
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో రైతులు రందిలేకుండ ఉన్నరు. రెండు సీజన్లలో బంగారు పంటలు పండించుకుంటున్నరు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎవుసం గురించి ఏం తెలుసు. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. సాగుకు 3 గంటల కరెంట్ చాలని అని అంటున్నడు. ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే తగిన బుద్ధి చెబుతం.
– కాల్వ రాములు పుట్నూర్ రైతు (పాలకుర్తి)