Singareni | యైటింక్లయిన్ కాలనీ, జూన్ 14 : సింగరేణి సంస్థ చివరకు స్కూల్ బస్సులు నడపలేని స్థితికి దిగజారడం ఆందోళన కలిగిస్తోందని, సంస్థ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే తమ నాయకుడు హరీష్‌రావు నేతృత్వంలో సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెట్టేందుకే కాంగ్రెస్ హటావో, సింగరేణి బచావో నినాదం భుజాన వేసుకున్నాడని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్ భవన్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిత్య సంఘాలు ఉన్నాయా? లేవా అన్న అనుమానం కలుగుతుందన్నారు. యైటింక్లయిన్ కాలనీ, సెంటినరీకాలనీల నుంచి గోదావరిఖనిలోని వివిధ స్కూళ్లకు వెళ్లే కార్మికుల పిల్లలకు నామమాత్రపు ఫీజుతో ఇన్నాళ్లు నడిపించిన స్కూల్ బస్సులను ఇప్పుడు రద్దు చేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటే గుర్తింపు సంఘం తమకేమి పట్టనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. సింగరేణిలో లేని బొగ్గు నిక్షేపాలను రికార్డుల్లో చూపిస్తూ కార్మికులను మోసం చేస్తున్నా పట్టడం లేదన్నారు.
తమ హయాంలో 15వేల మంది కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ పేరుతో మెడికల్ బోర్డును ఏడాదిన్నరగా మూసివేయడం దారుణమన్నారు. నిన్నటి శ్రీరాంపూర్‌లో డిప్యూటీ సీఎం కార్మికులకు కనీసం లాభాల వాటా ప్రకటించలేదనీ, అసలు సింగరేణి సంస్థలో ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొందన్నారు. కారుణ్య నియామకాలను కొనగిస్తారా అన్న నమ్మకం లేదన్నారు. కార్మికుల సంక్షేమం, విద్య, వైద్యం విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సంస్థకు బకాయిపడిన 54వేల కోట్లను వెంటనే ప్రభుత్వం అప్పగించాలన్నారు. సింగరేణిని ఏటీఎంగా వాడుకుంటూ కార్మికుల కష్టంను అప్పనంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు దోచి పెడుతుందన్నారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలకు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉందా అని ప్రశ్నించారు.
స్కూల్ బస్సులను రద్దు చేస్తే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఎందుకు ప్రతిఘటించడం లేదన్నారు. స్థానిక సీబీఎస్ఈ స్కూల్‌కు అదనపు బస్సులు మంజూరుకు త్వరలోనే తల్లిదండ్రులతో మాట్లాడి పునరుద్ధరించే బాధ్యత టీబీజీకేఎస్ తీసుకుంటుందన్నారు. సమావేశంలో నాయకులు ఐలి శ్రీనివాస్, చెరుకు ప్రభాకర్ రెడ్డి, నాగెల్లి సాంబయ్య, మల్లేశ్వరరావు, కేశవరావు, శశాంక్, నాగరాజు,కమలాకర్, పూర్ణాకర్, మహేందర్, రమేష్, తిరుపతి, వీవీ గౌడ్, శ్రీనివాస్, సుమన్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.