మెట్పల్లి, సెప్టెంబర్19: బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైద్యుడిగా రాణిస్తూ తన తండ్రి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు రాజకీయంగా గత 20 ఏండ్లుగా చేదోడువాదోడుగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఉచిత వైద్యశిబిరాలు, ప్రముఖ వైద్యులతో వైద్యచికిత్స, కరోనా సమయంలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, మందుల కిట్లు పంపిణీ చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు తన సొంత ఖర్చులతో వేయించారు. వైద్యపరంగా అనేకులకు అవసరమైన సహాయం అందిస్తూ కోరుట్ల నియోజకవర్గ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకత స్థానం సంపాదించుకున్నారు. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ పనుల కోసం గ్రామాల నుంచి కోరుట్ల, మెట్‌పల్లికి వచ్చే రైతులు, మహిళలు, వృద్ధులు, పేదలకు రూ.5కే కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తన సొంత ఖర్చులతో మంగళవారం కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసి, తన గొప్ప మనసును చాటుకున్నారు.
రోజుకు 720 మందికి
కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ భవనంలో, మెట్పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులోని కూరగాయల మార్కెట్ వద్ద అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రస్తుతం ప్రతి రోజూ 720 మందికి (కోరుట్లలో 360, మెట్పల్లిలో 360) ప్రస్తుతానికి కడుపు నిండా భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రాబోయే రోజుల్లో మరింత సంఖ్యను పెంచే అవకాశం ఉంది. ఇక్కడ భోజనం చేసేందుకు కేవలం రూ.5 చెల్లిస్తే సరిపోతుంది. నిజానికి ఈ రోజుల్లో ఏ హోటల్‌కు వెళ్లినా ఈ ధరకు టిఫిన్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.5కే కడుపు నిండా భోజనం అందించడం విశేషంగా చెప్పవచ్చు.
తల్లిపుట్టిన రోజున శ్రీకారం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తన తల్లి సరోజన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో అన్నపూర్ణ క్యాంటీన్లకు అంకురార్పణ చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, తల్లి సరోజన చేతుల మీదుగా క్యాంటీన్లను ప్రారంభించి ప్రజలకు భోజనం వడ్డించారు. సొంత ఖర్చులతో అన్నార్తుల ఆకలితీర్చే గొప్పసేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డా. సంజయ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
రుచికరమైన భోజనం
అన్నంతో పాటు పప్పు, సాంబారు, కూరగాయలతో కూడిన కూర, స్వీటు, పచ్చడి (చట్నీ)తో కూడిన రుచికరమైన భోజనం పెడుతున్నారు. రోజుకో రకం కూరగాయలతో కూడిన కూరను అందిస్తారు. హరే క్రిష్ణ మూమెంట్ (ఇస్కాన్ టెంపుల్) వారు ప్రతి రోజూ ఈ భోజనం సరఫరా చేస్తారు. ఒక భోజనం రూ.30కు ఇస్కాన్ సంస్థ వారు సరఫరా చేస్తుండగా, అందులో భోజనం తినేవారు రూ.5 చెల్లిస్తారు. మిగతా రూ. 25 డా.కల్వకుంట్ల సంజయ్ చెల్లిస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి నిధులు చెల్లించి సదరు సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు.
కడుపు నిండా బువ్వ పెడ్తున్రు
రూ. 5కు కనీసం టీ రాదు, టిఫిన్ రాదు. అసొంటిది ఎమ్మెల్యే సార్ కొడుకు డా. సంజయ్ సార్ వల్ల రూ. 5కే భోజనం దొరకుతుంది. కడుపు నిండా బువ్వ పెడ్తున్రు. అన్నం, పప్పు, సాంబారు, చెట్నీ ఇస్తున్రు. మంచి రుచి ఉంది. కూరగాయలు హోల్‌సేల్‌లో కొనుగోలు చేసి రిటేల్ను అమ్ముకుని బతుకుత. పొద్దుగాళ్ల నుంచి పొద్దుమికి దాక కూరగాయాల మార్కెట్లో కూర్చుకుని అమ్ముకుంటా. పగటి పూట ఇంటికెళ్లి సద్ది తెచ్చుకునుడు, లేదంటే బంద్ చేసి ఇంటికి వెళ్లి తిని రావడం చానా ఇబ్బందైతుండె. ఇప్పుడు మంచి సౌలత్ అయింది. అగ్గువకే మంచి బువ్వ పెడుతున్నందుకు సంతోషంగా ఉంది.
– గుండోజి భాగ్య, కూరగాయల వ్యాపారి, మెట్పల్లి
భోజనం బాగున్నది
మాది మెట్పల్లి మండలం జగ్గాసాగర్. నాకు ఊళ్లె ఉన్న 20 గుంటల్ల కూరగాయలు పండిస్త. వాటిని రోజూ మెట్‌పల్లికి తెచ్చి అమ్ముత. ఒక్కో సారి పగటీలికల్లా అమ్ముడుపోతవి. లేకుంటే సాయంత్రం దాకా ఉండి అమ్ముకుని పోతా. పొద్దున్నే రావడం వల్ల పగటి భోజనం కోసం గోసయితుండేది. కానీ సంజయ్ సారు, రూ. 5 కే భోజనం పెట్టించిండని తెలిసి చానా సంబురమైంది. అన్నం తిన్న. కూరలు మంచిగున్నవి. ఇక నుంచి ఆకలి అయితుంది ఎట్లా..? అనే రంది ఉండది.
– దుబ్బల గంగు, మహిళా రైతు, జగ్గాసాగర్