పాలకుర్తికి చెందిన నిరక్ష్యరాస్యుడైన ఓ రైతు పెద్దపల్లిలోని ఓ మెడికల్ షాపులో మందులు కొనేందుకు వెళ్లగా.. శాంపిల్ టాబ్లెట్స్ ఇచ్చారు. రసీదు కూడా ఇవ్వలేదు. సదరు మందులను రైతు ఇంటికి తీసుకువెళ్లగా.. ఆయన మనువడు వాటిని చూసి ‘ఇవి శాంపిల్ మందులు.. నీకు ఎవరిచ్చారు? ఫ్రీగా ఇచ్చారా..?’ అని అడిగాడు. డబ్బులకు కొన్నానని చెప్పడంతో అతడిని తీసుకొని ఆ మెడికల్ షాపునకు వెళ్లి నిర్వాహకులను నిలదీశాడు. దీంతో అవాక్కైన మెడికల్ షాపు యజమాని బతిమిలాడి కాళ్లబేరానికి వచ్చాడు. ఇలా మెజార్టీ మెడికల్ షాపుల్లో జీరో దందా నడిపిస్తూ.. శాంపిల్, నాణ్యతలేని మందులను అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నట్టు తెలిసింది.
పెద్ద్డపల్లి, జూన్ 7(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో మెడికల్ షాపులపై నియంత్రణ కొరవడింది. తకువ ధరకే దొరికే జనరిక్ మందులను అధిక ధరకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. జ్వరం వచ్చిందనో.. జలుబు చేసిందనో డాక్టర్ దగ్గరకు వెళ్తే.. వంద నుంచి 500 వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో పేదలు నేరుగా మెడికల్ షాపులకు వెళ్తుండగా, ఇదే అదనుగా షాపు యజమానులు దండుకుంటున్నారు.
వైద్యుడి ప్రిస్రిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు మెడికల్ దుకాణాలకు ఇచ్చే ప్రతి డ్రగ్‌పై బ్యాచ్ నంబర్ ఉంటుంది. ఇలా రిటైల్ దుకాణాలకు ఇచ్చే సమయంలో బిల్లుపై పొందుపర్చిన బ్యాచ్ నంబర్, కొనుగోలుదారులకు ఇచ్చే బిల్లుపై రాసే బ్యాచ్ నంబరు కూడా ఒక విధంగా ఉంటేనే సరైనవేనని నమ్మవచ్చు. కానీ, రెండు బిల్లులపై వేర్వేరు నంబర్లు ఉండడంతో నకిలీ మందుల దందా కొనసాగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నియంత్రణ కరువు
హోల్‌సెల్ ఏజెన్సీలతోపాలు, మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ విభాగం నిఘా పూర్తిగా కొరవడింది. పెద్దపల్లి జిల్లాలో ఎన్ని షాపులకు అనుమతి ఉంది? నిబంధనలు అతిక్రమిస్తూ మందులు ఎవరు విక్రయిస్తున్నారనే విషయంపై తనిఖీలు ఉండడం లేదు. దీంతో మందుల పాపుల యజమానులు జనరిక్ మందులు ఇచ్చి బ్రాండెడ్ మందుల ముసుగులో దోపిడీ చేస్తున్నారు. ఒకే రకమైన మందుల్ని తయారు చేస్తున్న కొన్ని కంపెనీలు జనరిక్పై ఒక ధర, బ్రాండెడ్ మందులపై మరో ధర ముద్రిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రెండు ధరలను ముద్రించడంతో గందరగోళం నెలకొంటున్నది. దీంతో రెండు రకాల మందుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటున్నది.
నిబంధనలు గాలికి..
వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించవద్దనే నిబంధనను మెడికల్ షాపుల యజమానులు తుంగలో తొకుతున్నారు. మెడికల్ షాపు నిర్వహించే ఫార్మసిస్టు డ్రెస్ కోడ్‌తోపాటు మందులు అందించే సమయంలో గ్లౌజులు వేసుకోవాలి. కొన్ని మందులను ఫ్రిజ్‌లో మాత్రమే భద్రపరచాలి. వినియోగదారుడికి కచ్చితంగా మందుల వివరాలతో కూడిన బిల్లు ఇవ్వాలి. కానీ, ఏదో ఒకటి, రెండు షాపుల్లో తప్ప మిగతా దుకాణాల్లో ఇది అమలు కావడం లేదు. మెడికల్ దుకాణాల యజమానుల యూనియన్ కనుసన్నల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు నడుస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కమీషన్ మాయాజాలం
మందుల విక్రయం పెద్ద వ్యాపారంగా మారింది. తమ కంపెనీకి చెందిన కోటి విలువ చేసే మందులు సేల్ చేస్తే అందులో 40 శాతం కమీషన్ ఇస్తామని నిర్వాహకులు వైద్యులతో ఒప్పందాలు చేసుకుంటున్నటు తెలుస్తున్నది. దీంతో వైద్యులు ఆ కంపెనీ మందులు సేల్ చేసేందుకు అవసరం ఉన్నా లేకున్నా రోగుల నెత్తిన రుద్దుతున్నారు. ప్రొటీన్ పౌడర్ బ్రాండెడ్ 150కి లభిస్తుండగా జనరిక్‌లో 25కు లభిస్తుంది. ఎన్జైమ్ సిరప్ 60కు లభిస్తే జనరిక్‌లో 25కు, ట్యాబ్లెట్ ఎసినిక్ ప్లస్ బ్రాండెడ్‌లో 50కు లభిస్తుండగా, జనరిక్ షాపుల్లో 10లకు దొరుకుతున్నది. అయితే, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయని కారణంగా రోగులు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు.
తెరుచుకోని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గల ఔషధ తనిఖీ అధికారి (డ్రగ్ ఇన్స్పెక్టర్) కార్యాలయం అసలు తెరుచుకోవడం లేదు. ఈ విషయంపై డ్రగ్ ఇన్స్పెక్టర్ను సంప్రదించగా.. తమ కార్యాలయానికి సిబ్బంది లేరని, తాను ఎప్పుడూ తనిఖీలు, ఇతర కేసులకు సంబంధించి వెళ్లాల్సి ఉంటుందని, అందువల్లే కార్యాలయంలో ఉండడం లేదని తెలిపారు. అయితే జిల్లాలో తనిఖీలు జరిగినట్లు కూడా నెలకు ఒక్క ప్రకటన కూడా మీడియాకు రాదు. దీంతో అసలు జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడా.. లేడా? అన్నట్టుగానే ఉన్నది.