..పక్క ఫొటోలో కనిపిస్తున్నది మందు పార్టీ కాదు.. ప్రైవేట్ వాళ్లు ఇవ్వడం లేదు.. మరేంటి అనుకుంటున్నారా..? కరీం‘నగరం’ నడిబొడ్డున యథేచ్ఛగా నడుస్తున్న పర్మిట్ రూంలు ఇవి! నిబంధనల ప్రకారం.. కేవలం 10*10 సైజ్ (వంద స్కేర్ మీటర్స్)లో మాత్రమే పర్మిట్ రూం ఉండాలి. అంటే ఓ చిన్న బెడ్రూం సైజ్‌లో మాత్రమే ఉండాలి. కానీ, ఇక్కడ మనకు కనిపిస్తున్న పర్మిట్ రూంలను చూస్తే.. దాదాపు 20 గుంటల నుంచి ఎకరం స్థలంలో నడుస్తున్నాయి. అది కూడా బాహాటంగా.. నగరం నడిబొడ్డున! అంటే ఈ అక్రమ దందాలకు అధికారుల సహకారం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. లోతుగా చూస్తే.. దీని వెనుక నెలకు 60లక్షల నుంచి 70 లక్షల మామూళ్ల దందా జరుగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇవి మచ్చుకు మాత్రమే అయినా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలా కోకొల్లలుగా నడుస్తున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ మామూళ్ల మత్తులో తూగుతున్నది. పర్మిట్ రూంల పేరిట కొంత మంది వైన్స్ వ్యాపారులు విచ్చలవిడిగా దందాలు చేస్తున్నా.. అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. సాక్షాత్తూ జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూంలు నడుపుతున్నా.. బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో రకరకాల ఫుడ్ విక్రయాలు జరుగుతున్నా.. వీటిపై లిఖిత పూర్వక ఫిర్యాదులు అందుతున్నా.. పట్టించుకోకపోవడం వెనుక పెద్ద అవినీతి తతంగమే జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలనెలా మామూళ్లు పుచ్చుకొని, అక్రమ దందాలకు అధికారులు సంపూర్ణంగా సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకేంద్రాల్లో పర్మిట్ రూంల పేరిట సాగుతున్న ఇల్లీగల్ దందాలు కండ్ల ముందే కనిపిస్తున్నా ఎవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కరీంనగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వైన్స్‌ల పరిధిలో పర్మిట్ రూంలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలు, ఇదే సమయంలో వీటి నిర్వహణకు కొన్ని నిర్దిష్ట నిబంధనలు పెట్టాయి. వాటిని పకడ్బందీగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే అడుగడుగునా ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. నిజానికి పర్మిట్ రూంల నిబంధనలను పరిశీలిస్తే.. పర్మిట్ రూం కేవలం 10*10 సైజ్ (వంద స్కేర్ మీటర్లు) అంటే ఓ చిన్న బెడ్రూం అంతా స్థలంలో మాత్రమే వైన్స్దారులు నిర్వహించాలి. బార్లకు వెళ్లలేని నిరుపేద వర్గాల్లోని మద్యం ప్రియులు వైన్స్‌లో కొనుక్కొని, దాని పరిధిలోనే తాగి వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ పర్మిట్ రూంలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో కుర్చీలు, టేబుళ్లు వేయరాదు.
అలాగే అక్కడ వంటలు చేయడానికి, ఆహార పదార్థాలు విక్రయించడానికి అనుమతి లేదు. వెజ్, నాన్‌వెజ్ వంటి ఐటమ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మద్యం ప్రియులు అక్కడ కూర్చోవడానికి ఎటువంటి సౌకర్యాలు కల్పించేందుకు వీలులేదు. కేవలం తాత్కాలికంగా నిలబడి మాత్రమే తాగి వెళ్లాలి. వైన్స్ దుకాణాని కి ఆనుకొని మాత్రమే పర్మిట్ రూం ఉండాలి. అలాగే విద్యాసంస్థలు, దేవాలయాల, హాస్టల్స్‌కు వంద మీటర్ల పరిధిలో ఉండరాదు. పర్మిట్ రూం పరిధి లో కేవలం తాగునీటి సౌకర్యంతోపాటు ప్యాకేజీ ఫుడ్ (కారా, చిప్స్, పల్లీలు, పుట్నా ల వంటి ప్యాకెట్లు మాత్రమే) అందుబాటులో ఉండేలా నిబంధనలున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా దందాలు
పేదలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన పర్మిట్ రూంలను కొంతమంది వైన్స్దారులు తమ వ్యాపార సామ్రాజ్యాలుగా మార్చుకున్నారు. వాటిని రోజురోజుకూ విస్తరిస్తున్నారు. కొంతమంది అయితే దాదాపు ఎకరం స్థలంలో పర్మిట్ రూంలు నడుపుతూ యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఈ తరహా దందాలు ఎక్కడో కాదు, సాక్షాత్తూ జిల్లాకేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోనే నడుస్తున్నాయి. వాస్తవానికి పర్మిట్ రూంలు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా.. లేదా..? అన్న దానిపై ఎక్సైజ్ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలి. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ, మామూళ్ల మత్తుకు అలవాటు పడిన అధికారులు.. అక్రమార్కులకు వంత పాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అక్రమ దందాలకు పాల్పడుతున్న పర్మిట్రూం నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి నెలకు 30వేల నుంచి 50వేల మామూళ్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు ముడుతున్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, 20 గుంటల నుంచి ఎకరం స్థలంలో నడిపే కొంత మంది వ్యాపారులు నెలకు లక్ష నుంచి 2లక్షల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్టు తెలిసింది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే పర్మిట్ రూంల నుంచి నెలకు 60లక్షల నుంచి 70 లక్షల వరకు ముడుపులు సంబంధిత అధికారులకు అందుతున్నాయన్న చర్చ ప్రస్తుతం ఆ శాఖలోనే జోరుగా నడుస్తున్నది.
అందులో కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా చేతులు మారుతున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అధికారులు లంచాలకు తలొగ్గి నెలనెలా వచ్చే ముడుపులను జేబులో వేసుకుంటున్న తీరును అలుసుగా తీసుకుంటున్న పలువురు వ్యాపారులు చెలరేగి పోతున్నారు. ఇదే అదనుగా కొంత మంది పర్మిట్ నిర్వాహకులు తమ వ్యాపారాలను రోజురోజుకూ విస్తరిస్తూ ‘మూడు పూలు.. ఆరు కాయలు’గా నడుపుతున్నారు. ఉదాహరణకు చూస్తే.. కరీంనగర్ జిల్లాకేంద్రంలో కొంతమంది వైన్స్దారులు పర్మిట్ రూంల పేరిట దాదాపు ఎకరం స్థలంలో దందా నడుపుతుండడమే దీనికి నిదర్శనం. మరికొంత మంది 20 నుంచి 30 గుంటల స్థలంలో నడుపుతున్నారు. ఇదే తరహా వ్యవహారం ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్నది.
మటన్, చికెన్ అన్నీ అక్కడే
నిబంధనల ప్రకారం చూస్తే.. పర్మిట్‌రూంల వద్ద చిప్స్, పల్లీలు, కార తదితర వంటి వాటిని మాత్రమే విక్రయించాలి. కానీ, ఏకంగా వంట గదులు ఏర్పాటు చేసి అన్ని రకాల ఫుడ్ పెడుతున్నారు. వెజ్, నాజ్ వెజ్‌తోపాటు స్నాక్స్ వంటి రకరకాల పుడ్ అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బార్ అండ్ రెస్టారెంట్లో ఎటువంటి ఐటమ్స్ అందుబాటులో ఉంటాయో.. అదే తరహాలో పర్మిట్ రూంల్లోనూ అందిస్తున్నారు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ధరలు బార్లతో పోలిస్తే తక్కువగా ఉంటున్నాయి. ఎటువంటి తనిఖీలు లేకపోవడంతో నాసిరకం ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నట్టు తెలుస్తున్నది.
మద్యం ప్రియులు ఇవేమీ గమనించకుండా తినడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రధానంగా పర్మిట్ రూంలకు యూత్ అట్రాక్ట్ అవుతున్నది. నిబంధనల ప్రకారం పర్మిట్ రూంలకు 21ఏళ్లలోపు ఉన్న యువతీయువకులను అనుమతించడానికి వీలులేదు. కానీ, స్టూడెంట్స్‌ను వచ్చినా పెద్ద పీట వేసి స్వాగతం పలుకుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా.. చిన్న పెద్దా అనే విషయాన్ని పట్టించుకోకుండా.. పర్మిట్రూంల్లోకి అనుమతిస్తూ మందు సరఫరా చేస్తున్నారు. సారా, గుడుంబా వంటి విక్రయాలు చాటుమాటుగా చేస్తేనే వారిపై నిఘావేసి పట్టుకునే ఎక్సైజ్ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా అది కూడా నగరం నడిబొడ్డున పర్మిట్ రూంలను యథేచ్ఛగా నడుపుతున్నా ఏనాడూ వాటిని ముట్టుకోకపోవడం వెనుక నెలనెలా చేతులు మారుతున్న మామూళ్లే కారణం అన్న విమర్శలున్నాయి.
ఫిర్యాదులు చేసినా చలనం లేదు
వ్యాపారం ఎవరూ చేసినా నిబంధనలకు లోబడి చేసుకోవాలన్నది మా ఉద్దేశం. కానీ, కొంతమంది పర్మిట్ రూంల పేరిట విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. వీటిపై ఆధారాలతో సహా జిల్లా నుంచి మొదలు కొని రాష్ట్ర స్థాయి వరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశాం. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, చిరునామాలను సమర్పించాం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పర్మిట్రూంలపై చర్యలు తీకోవాలని పదే పదే కోరాం. అయినా అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. దీని వల్ల నిజాయితీగా.. న్యాయంగా వ్యాపారం చేస్తున్న కొంతమంది వైన్స్దారులతోపాటు ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్ వాళ్లు భారీగా నష్టపోతున్నారు.
వ్యాపారం అనేది కొంత మంది వద్ద మాత్రమే కేంద్రీకృతం కావడం వల్ల.. ఇదే వ్యాపారాన్ని నమ్ముకొని దుకాణాలు, రెస్టారెంట్లు నడుపుతున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా నిబంధనలను తుంగలో తొక్కి పర్మిట్ రూంలను నడుపుతున్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారుల తీరుమారకపోయినా, అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోకపోయినా భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.
– బైరం పద్మయ్య, రాష్ట్ర బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు