Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 14: సిగ్గు… సిగ్గు… పాపం పసివాళ్లు అని చూడకుండా… ప్రాచీన కళలకు జీవం పోస్తున్నారని అభినందించకుండా.. అధికార పార్టీ నేత ఒకరు అక్కసు వెళ్లగక్కిన అమానవీయ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో ఆదివారం వెలుగుచూసింది. ఈ సంఘటనపై స్థానిక ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. సామాజిక మాధ్యమంలో సిటిజన్ల వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. పిల్లలపై ప్రతాపం చూపించడం సిగ్గుచేటన్న విమర్శలకు దారితీసింది.
గోదావరిఖని విఠల్ నగర్ లో ఆగస్టు 31న సామాజిక కార్యకర్త కటుకు ప్రవీణ్ ఆధ్వర్యంలో డివిజన్లోని చిన్నారులకు ప్రాచీన కళలైన అకాడపై ఉచితంగా శిక్షణ తరగతులను బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి చేతుల మీదుగా ప్రారంభించారు. హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో అకాడ శిక్షకుడు మచ్చ శంకర్ ద్వారా ప్రతీ రోజూ సాయంత్రం సుమారు 60 మంది పిల్లలకు ఉచితంగా తర్పీదు ఇస్తున్నారు. చిన్నారులు సైతం ఎంతో ఆసక్తిగా సాధన చేస్తున్నారు.
ఇది డివిజన్లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి మింగుడు పడలేదు. తనను కాదని బీఆర్ఎస్ నాయకుడిని ముఖ్యతిథిగా పిలిచారనో లేక మరే కారణమో గానీ అక్కసును వెళ్లగక్కాడు. అధికార పలుకుబడి ప్రయోగించి మున్సిపల్ సిబ్బందిని పురమాయించాడు. దీంతో శనివారం సాయంత్రం అకాడ ప్రదేశం వద్ద మున్సిపల్ సిబ్బంది వీధి లైట్లను తొలగించి తీసుకవెళ్లినట్లు నిర్వాహకుడు కటుకు ప్రవీణ్ తెలిపారు. కాగా, అకాడ నేర్చుకుంటున్న పసి పిల్లలకు వసతులు కల్పించాల్సింది పోయి కక్షసాధింపుతో వీధి లైట్లు తొలగించడం సరికాదని డివిజన్ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
కాగా, చీకట్లో పిల్లలు అకాడ నేర్చుకుంటున్న దృశ్యాలను నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సిటిజన్లు సైతం అధికార పార్టీ నేత, మున్సిపల్ సిబ్బంది పనితీరును వ్యతిరేకించడం గోదావరిఖనిలో చర్చనీయాంశంగా మారింది. అలాగే తమ పార్టీపై కక్షతో పసి పిల్లలపై ప్రతాపం చూపించడం పిరికిపంద చర్య అని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఆకాడ అనేది ఒక ప్రాచీన కళ అనీ, మరుగున పడుతున్న ఈ కళకు తిరిగి జీవం పోస్తూ పిల్లల శారీరక, మానసిక దారుఢ్యం కోసం ఉచితంగా శిక్షణ ఇస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి లైట్లు తొలగించడం సిగ్గుచేటన్నారు.
చాలా విచారకరం…: కటుకు ప్రవీణ్, నిర్వాహకుడు
సొంత ఖర్చులతో 60 మంది పిల్లలకు అకాడ శిక్షణ ఇప్పిస్తున్నా. మొదట విఠల్ నగర్ ఆటో స్టాండ్ వద్ద ప్రారంభిస్తే అక్కడ నుంచి వెళ్లగొట్టారు. తర్వాత హనుమాన్ టెంపుల్ ప్రాంగణంకు మార్చినం. ఐనప్పటికీ కక్షసాధింపు ధోరణితో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మున్సిపల్ సిబ్బందిచే శనివారం సాయంత్రం అర్ధాంతరంగా అక్కడ లైట్లు తొలగించాడు. పిల్లలు ఏ పాపం చేశారు. ఐనప్పటికీ చీకట్లోనే శిక్షణ కొనసాగిస్తున్నం.
ఇంతకంటే సిగ్గుమాలిన పని మరోటి లేదు: కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
రామగుండంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఏదైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీతో ఎదురుపడాలె. అంతేగాని రాజకీయ కక్షతో పసి పిల్లలపై ప్రతాపం చూపించడం సిగ్గుమాలిన పని. ప్రతీది రాసి పెట్టుకుంటున్నాం. ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు. ప్రాచీన కళ అకాడ నేర్చుకుంటున్న పిల్లలను ప్రోత్సహించాలి. కానీ, అక్కడ వీధి లైట్లు తొలగించడం పిరికిపంద చర్య. ఇంతకంటే అమానుషం మరోటి లేదు. పదేళ్లు అధికారంలో ఉన్న మేము ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. అందరినీ కలుపుకొని పని చేశాం. కానీ ఇప్పుడు రామగుండంలో కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం చనిపోతుందా అన్న బాధ కలిగిస్తోంది. అకాడ నేర్చుకునే పసి పిల్లలకు ఇబ్బంది కలిగించడానికి వీధి లైట్లు తీపించడంను ప్రజలంతా గమనించాలి. రామగుండంలో రాక్షస పాలనకు ఈ సంఘటన ఒక ఉదాహరణ.