సిటీబ్యూరో, మార్చి 14 ( నమస్తే తెలంగాణ ) : ఆటో గ్యాస్ ధరలు పెంచి డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని నారాయణ గూడ చౌరస్తా, నాచారంలోని ఆటో స్టాండ్‌లో ఆటో డ్రైవర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, వెంకటేశ్ మాట్లాడుతూ..
ఆటో డ్రైవర్లు ఇప్పటికే గిరాకీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.64 ఉన్న గ్యాస్ ధర 40 రూపాయలు పెంచారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకున్నా నగరంలో అన్ని బంక్‌లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదట్నుంచి అన్యాయమే జరుగుతుందన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి ఆటోడ్రైవర్ల బతుకులురోడ్డు పాలు చేశారని చెప్పారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి ఇప్పటికీ చేయలేదని ఆరోపించారు. ఏడాదికి రూ.12వేలు ఇస్తామని మాటిచ్చి నెరవేర్చలేదని వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎల్పీజీ, సీఎన్జీ ధరలను బంక్ యాజమాన్యాలు ఇష్టానుసారం పెంచినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. సర్కార్ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈనెల 16 నుంచి నగర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. రవాణా శాఖ మంత్రికి ఎన్నో సార్లు ఆటో డ్రైవర్ల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు ఎం.ఏ.సలీం, జనార్దన్ రెడ్డి, లింగం గౌడ్, దయానంద్, శివానంద్, శ్రీనివాస్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.