నదిలో నీరు పారాలి.. కన్నీరు కాదు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఆ కన్నీటిని పారిస్తే! మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రణాళికల నేపథ్యంలో పరీవాహక ప్రాంతంలోని ప్రజలు ఎవరిని కలిసినా నిర్వేదమే. నిస్సహాయ స్థితిలో మిగిలిపోయామన్న ఆవేదన. తమ అభిప్రాయాలను తెలుసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమేమిటన్నది ప్రజల ఆక్రోశం. ప్రభుత్వం అర్థం చేసుకోకపోగా, అసలు పట్టించుకోవడమే లేదు. ఎవరికో కనువిందు చేయడానికి మా కడుపు కొట్టాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మూసీ పరీవా హక ప్రాంతంలో ఉన్నవారంతా మధ్య తరగతి, నిరుపేద వర్గాలే. నిరుపేదలంతా 50, 60 గజాల స్థలంలో చిన్న గుడిసెలో, రేకుల షెడ్లో వేసుకున్నవారే. పేదల పొట్టగొట్టి ప్రభుత్వం గాంధీ విగ్రహం పెడుతామంటే కనీసం మహాత్ముడి ఆత్మ అయినా శాంతిస్తుందా? ఇల్లంటే అదొక ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదు. అదొక అనుబంధం. కష్టార్జితాన్ని కండ్లారా చూసుకునే సందర్భం.
అసలు బఫర్ జోన్ అంటే ఏమిటి? నదిలో వచ్చే వరదకు గురికాకుండా, పరిసరాల మురికి నీరు నదిలో కలవకుండా నిరోధించాలన్న ఉద్దేశంతో ఒకప్పుడు బఫర్ జోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పడు ఎక్కడికక్కడ మురికి నీటిని శుద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. శుద్ధ జలాన్ని నదిలో చేర్చే సాంకేతిక నైపుణ్యం ఉన్నది. అపార్టుమెంటు స్థాయిలోనే నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఈ కోణంలో ఆలోచించకుండా బఫర్‌జోన్ పేరిట నిర్మాణాలను తొలగిస్తామనడం సబబేనా? అసలు మూసీ నదిలో వరద ఎక్కడ ఉన్నది? అలాంటి పరిస్థితిలో బఫర్‌జోన్‌ను ఏ ప్రాతిపదికన నిర్ధారించారన్నది ప్రశ్న.
కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు 58, 59 జీవో ద్వారా దశాబ్దాల నుంచి 30, 40 గజాల్లో ఇల్లు కట్టుకున్న పేద బస్తీ జనాలకు పట్టాలిచ్చి రెగ్యులరైజ్ చేసింది. బస్తీలలో బస్తీ దవాఖానలు పెట్టి పేదలకు వైద్యం అందేలా చూసింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు అందించింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆ ప్రజలంతా అడుగుతున్న ప్రశ్న ఒకటుంది. మూసీ వెడల్పును కొంచెం తగ్గించి సుందరీకరణ పనులు చేపడితే ఏమైనా ఇబ్బందా? అని. ఇళ్లను పడగొట్టకుండా, నదికి రెండువైపులా కరకట్టలు, రక్షణ గోడలు కట్టి అభివృద్ధి చేయకూడదా అని అడుగుతున్నారు. ప్రజలను ఆకర్షించేది నదిలో నిండుగా ప్రవహించే నీరు తప్ప, పక్కనున్న పార్కులు కాదు. దాన్ని పట్టించుకోకుండా ఇల్లు పీకి పందిరి వేస్తామంటే నమ్మేవారు ఎవరు ఉంటారు?
మూసీ సుందరీకరణ అంటే చరిత్రను కూడా మనసులో పెట్టుకోవాలి. హైదరాబాద్ అంటే ప్రేమకు చిహ్నం. దానికి సూత్రధారి మూసీ నది. కుమారుడు నర్తకి అయిన అనార్కలిని ప్రేమిస్తే ఆమెను అక్బరు చక్రవర్తి సజీవ సమాధి చేసినట్టు చరిత్రలో చదివాం. కులీ కుతుబ్‌షా-భాగమతి ప్రేమ చరిత్రాత్మకం. కుతుబ్‌షా ప్రేమ కోసం ఆయన తండ్రి నగరాన్నే నిర్మించాడు. గోల్కొండ నుంచి కుతుబ్‌షా రాకపోకల కోసం మూసీపై వంతెనను నిర్మించాడు. ‘పురానా పూల్’గా ఇప్పటికీ అది సేవలు అందిస్తోంది. నిజానికి అది ‘పూల్ ఎ మొహబ్బత్’. దానికి ఆ పేరే పెట్టాలి. ప్రపంచంలోనే ఇదొక అద్భుతం. దీన్ని కేవలం ఓ బ్రిడ్జిగా వదిలేయకుండా ‘ప్రేమ వారధి’గా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ వచ్చినవారెవరూ దీన్ని చూడకుండా తిరిగి వెళ్లలేరు. పురానాపూల్ అద్భుతమైన నిర్మాణం. దానిని పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చు.
రాజేంద్రనగర్‌కు హైకోర్టు తరలిపోతుండడంతో పాత భవనాన్ని రాజదర్బారుగా తీర్చిదిద్దితే అది కూడా పర్యాటక ప్రాంతమే. పురానాపూల్ ప్రాంతం పెద్ద ఆకర్షణ కేంద్రంగా మారుతుంది. ఎలాంటి కూల్చివేతలు లేకుండానే ఇది సాధ్యపడుతుంది. తొలుత ఇలాంటి చారిత్రక విషయాలపై దృష్టి పెట్టాలి. ఇవన్నీ ప్రజలు చెప్పిన సూచనలే. నిపుణుల సిఫారసులను కొట్టిపారేయకూడదు. హంకాంగ్లోనో, బ్యాంకాక్‌లోనే ఇలా చేశారంటే కుదరదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రత్యేకత.. హైదరాబాద్‌దే. మూసీ సుందరీకరణ కేవలం ఆర్థిక, పర్యావరణ, పర్యాటక అంశమే కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా సామాజిక సమస్య. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించడం లేదు. నిజంగా గుర్తించి ఉంటే ఈ పాటికే ప్రజల అభిప్రాయాలు స్వీకరించి ఉండేది.
హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణంలో స్టేషన్‌కు ఒక మోడల్‌ను రూపొందించాల్సి వచ్చింది. యూనిఫారంగా అన్ని స్టేషన్లకు ఒకే తరహా మోడళ్లను డిజైన్ చేయలేదు. అందుకే నగరంలో ఏమి చేయాలన్నా స్థానిక స్థితిగతులను అధ్యయనం చేయాల్సిందే. యూనిఫారంగా చేస్తామంటే అమలు సాధ్యం కాదు.
నదుల సుందరీకరణ కొత్తది కాదు. గుజరాత్‌లోని నర్మద సహా, దేశంలో చాలా చోట్ల జరిగాయి. అందరూ అందంగా మారిన నదులను చూసి వస్తున్నారే తప్ప పునరావాసం పొందిన బాధితుల తాజా పరిస్థితి ఏమిటన్నది అధ్యయనం చేయాలి. ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చినవారికి ఇతర రాష్ర్టాలకు వెళ్లడం పెద్ద పనేమీ కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మొదటి దశలో గాంధీ ఘాట్ అభివృద్ధి చేస్తుందట. గాంధీ సరోవర్‌ను నిర్మించి, సుమారు రూ.5 వేల కోట్లు అన్నది ఒక అంచనా. ఇందులో ఇంకా స్పష్టత లేదు. పెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి, ఉద్యనవనాలు ఏర్పాటు చేస్తామని మాత్రం ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఎక్కడెక్కడివారో వీటిని చూసి ఆహ్లాదం పొందుతారట. పర్యాటకలు వస్తారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలు పెరుగుతాయన్నది ప్రభుత్వ ఆర్భాటపు ప్రచారం చేస్తున్నది. కొందరి ఆహ్లాదం కోసం మరికొందర్ని ఇంట్లోంచి గెంటేసి, ఇండ్లను కూల్చుతామని అనడం సామాజిక న్యాయం అనిపించుకోదు. సామాజిక న్యాయం లేని అభివృద్ధి అభివృద్ధే కాదు. ‘జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్’ అన్న మాటను ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
(వ్యాసకర్త: తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్)
-గోసుల శ్రీనివాస్ యాదవ్ ,98498 16817