కోటగిరి, మే 31: మంజీరా నదిలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. పొతంగల్కు చెందిన కురుమ గంగొండ (43) ఇంటికి తన బావ అయిన రెంజల్ మండలం బోర్గాంకు చెందిన గంగారాం(50) శనివారం వచ్చాడు. ఆదివారం ఉదయం గంగొండ, అతడి కుమారుడు కురుమ సంతోష్, గంగారాంతో కలిసి పొతంగల్ మంజీరా నది వద్దకు గొర్రెలను తీసుకెళ్లారు. గంగారాం గొర్రెలను శుభ్రం చేయడానికి నీటిలో దిగి ప్రమాదవశాత్తు కాలుజారి మునిగిపోతుండగా, అతడిని కాపాడటానికి వెళ్లిన గంగొండ కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న సంతోష్ వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటికి తీయించారు. గంగొండ భార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.