వేసవికి ముందే ఎవుసానికి కష్టకాలం మొదలైంది. మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితి కనిపిస్తున్నది. ఏడాదిన్నర కిందటి వరకు మండుటెండల్లోనూ వాటర్హబ్ను తలపించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు నేల నెర్రెలు బారుతున్నది. బావుల్లో నీళ్లు లేక.. కాలువల్లో పారక సాగునీటి గోస తీవ్రమవుతున్నది. యాసంగి పంటలు ఎండిపోతుండగా, అన్నదాత గుండె చెరువవుతున్నది. మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన కష్టాలు పునరావృతమతుండగా, చేను, చెలకలను తడిపేందుకు భగీరథ ప్రయత్నమే చేయాల్సిన దుస్థితి వచ్చింది. మడి మడికి పైపులు వేసుకోవడం, అడుగంటిన బావుల్లో పూడిక తీయడం, సైడ్, కొత్త బోర్లు వేయించుకోవడం వంటి నాటి కాఠిన్య పరిస్థితులు పోయిన యాసంగి నుంచే కండ్లముందు కదలాడుతున్నాయి. కాళేశ్వరం జలాలతో నట్టెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు ఇప్పుడు వెలవెలబోయి దర్శనమిస్తున్నాయి. కాలువ ద్వారా సరిపడా నీళ్లిస్తేనే పంటలు చేతికొచ్చే పరిస్థితులు ఉన్నాయి.
కరీంనగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ రూరల్: రెండేళ్ల కిందటి వరకు వాటర్ హబ్‌గా వెలుగొందిన కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి యాజమాన్యం సరిగ్గా లేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అనేక మండలాల్లో పంటలు ఎండిపోయాయి. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు నీరందక వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇటు గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్‌కు సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో ర్యాలపల్లి, నారాయణపూర్ గ్రామాల్లోని వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందక కరీంనగర్ మండలం గోపాల్పూర్, దుర్శేడ్, చేగుర్తి, మొగ్దుంపూర్, చామన్‌పల్లి తదితర గ్రామాల్లో కూడా పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. ఈ యేడాది కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే సంకేతాలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కరీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లిలో రైతులు పడుతున్న కష్టాలు యాసంగి సీజన్‌కు ముందే హెచ్చరిస్తున్నాయి. ఈ గ్రామానికి వెదురుగట్ట మీదుగా పెద్దపల్లి జిల్లాకు వెళ్లే డీ-87కు 11ఆర్ కాలువ ఉన్నది. ఇక్కడి నుంచి చామన్‌పల్లి రాజసముద్రం చెరువులోకి ఎస్సారెస్పీ నీళ్లు రావాల్సి ఉంటుంది.
గతంలో కాలువ నిండుగా వచ్చిన కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెరువు ఏటా నిండేది. ఇప్పుడు తక్కువ నీరు వస్తున్నదని, చెరువు నిండకపోగా ఉన్న నీళ్లు పంటలకు వాడుకుంటే నీటి మట్టం తగ్గుతున్నదని రైతులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు ఎక్కువ నీటిని తీసుకెళ్తూ, 11ఆర్కు తక్కువ నీటిని వదులుతున్నారని వాపోతున్నారు. చెరువు కింద పంటలు వేసి నెల రోజులే అవుతున్నదని, ఇంకా రెండు, రెండున్నర నెలలు సాగునీరు అందించాల్సి ఉంటుందని, చెరువులో నీళ్లు చూస్తే ఇంకో నెలకు కూడా సరిపోవని ఆందోళన చెందుతున్నారు. 11ఆర్ ద్వారా నీటి విడుదలను పెంచితే తప్పా తమ చెరువు నిండే పరిస్థితి లేదని చెబుతున్నారు.
పంటల సాగు చేసినంక నీళ్లస్త లేవు. ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మా బావి ఎత్తిపోయేటట్టు ఉన్నది. అందుకే పూడిక తీస్తున్నం. మా ఊరిల చాలా మంది పరిస్థితి ఇట్లనే ఉన్నది. గతంలో ఫుల్లు నీళ్లస్తుండే. ఏ బావిల చూసినా మీదికే నీళ్లుంటుండే. పది, పన్నెండు గజాల బావులే ఎకరాలకు ఎకరాలు పారిస్తుండే. ఇప్పుడు రెండేండ్ల నుంచి అనుకుంట. బావులు ఎండి పోతున్నయి. నీళ్లు లేకుంటే పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే బావిల పూడిక తీయిస్తున్నం. సైడ్ బోర్లు కూడా ఏయించినం. ఇప్పుడన్నా నీళ్లు సరిపోతయో లేదో చూడాలే. ఈ పక్క రైతులందరూ బావుల్ల పూడిక తీయించుకుంటున్నరు. బావుల అడుగు తవ్వించుకుంటున్నరు. కాలువల నీళ్లు ఫుల్లుగా వస్తే మాకు ఈ కష్టాలు ఉండేటివి కాదు.
– దూడం నిఖిల్(చామన్‌పల్లి)
పెద్దపల్లి జిల్లాకు వెళ్లే డీ-87 నుంచి మాకు నీళ్లు వచ్చే 11ఆర్ కాలువ ఉన్నది. గతంల ఈ కాలువ ద్వారా నీళ్లచ్చేవి. మా ఊరు సస్యశ్యామలం అయ్యేది. గత రెండు సీజన్ల నుంచి నీళ్లస్త లేవు. పెద్దపల్లికే ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నరు. కాలువ పరిస్థితి కూడా మంచిగ లేదు. వెదురుగట్ట పెద్దమ్మ గుడికాడ కొంచెం ఎత్తుంటది. కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తేనే మా రాజసముద్రం చెరువులకు పుష్కలంగా నీళ్లస్తయి. ఇప్పుడు సగానికి తక్కువనే నీళ్లస్తన్నయి. ఆ ఎత్తుగడ్డకాడనే మర్రగమ్ముతున్నయి. ఇగ నీళ్లెట్లస్తయి? రాజసముద్రం కింద 300 ఎకరాలు ఉంటది. దాని మీద సుతం ఈ కాలువ నీళ్లే ఆధారం. అక్కడొక వందెకరాల వరకు ఉంటది. ఇంత ఆయకట్టుకు నీళ్లు సరిపోవాల్నంటే కాలువ సామర్థ్యం మేరకు వదలాలే. కానీ, ఎవరు పట్టించుకుంట లేరు. ఎస్సారెస్పీ అధికారులను అడిగితే మొత్తం నీళ్లు ఇస్తున్నమని చెబుతున్నరు. మరి నీళ్లెక్కడికి పోతున్నయి? మా ఊళ్లె పంటలు ఎట్ల ఎండుతున్నయి?
– తాళ్లపల్లి ఎల్లాగౌడ్, చామన్‌పల్లి
నీరులేక ఎండిపోయిన పొలంలో దీనంగా కూర్చున్న ఈ యువ రైతు పేరు బోగొండ రాజు. కరీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లి. ఆయనకు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. రెండేళ్ల కిందటి వరకు నిరందిగా ఎవుసం చేసిన రాజుకు, నిరుటి యాసంగి నుంచే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తన వ్యవసాయ బావికి గతంలో 5 హెచ్‌పీ మోటర్తో నాలుగు గంటలు నడిపించినా నీళ్లు తగ్గేవి కాదు. ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటడంతో అరగంట కూడా నడవడం లేదు.
గతంలో మూడెకరాల్లో పొలం, ఒక్క ఎకరంలో మక్క పంటలు సాగు చేసినా పదేళ్లలో ఏ ఒక్కరోజూ నీటి సమస్య రాలేదు. కానీ, ఇప్పుడు మూడెకరాల్లో మక్క, ఎకరంలో వరి పంటను దక్కించుకునే పరిస్థితి లేదు. గతంలో కాలువల ద్వారా పుష్కలంగా నీళ్లు రావడంతో భూగర్భ జలాలు భారీగా పెరిగి రాజు బావి నిండు కుండలా ఉండేది. ఇప్పుడు అడుగంటి పోయింది. నెల కింద 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేసిన బోరు నుంచి సరిగ్గా నీరు అందడం లేదు. ఫలితంగా మక్క, పొలం ఎండిపోతున్నాయి. పెట్టుబడి మీద పడిందని రాజు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇది ఒక్క రాజు పరిస్థితే కాదు, ఆయన చుట్టు పక్కల ఎవుసం చేస్తున్న రైతులందరి పరిస్థితి ఇలాగే ఉన్నది.
చామన్‌పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు బోగొండ లక్ష్మిది మరో దీనగాథ. నిరుటి నుంచే కాలువ నీళ్లపై ఆశలు వదులుకున్న ఆమె, ఈ సారి యాసంగిలో తన మూడున్నర ఎకరాల్లో మక్కసాగు చేసింది. లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టింది. నాలుగైదు సార్లు వేలాది రూపాయల విలువైన మందులు వేసింది. కానీ, నీళ్లు లేక కండ్లముందే పంట ఎండిపోతుంటే కన్నీటి పర్యంతమవుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయని ఆశించిన లక్ష్మికి ఈ సారి నిరుడి కంటే కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. 11ఆర్ కాలువ ద్వారా నీళ్లు రాకుంటే బావిలో ఉన్న కొద్దిపాటి నీళ్లలో మక్కను కాపాడుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది.
బావి నుంచి మడి మడికి ప్లాస్టిక్ పైప్ వేసుకుని నీళ్లు పారించే ప్రయత్నం చేసింది. కానీ, ఒక పక్క తడుపుతుంటే ఇంకో పక్క ఎండుతూ వచ్చింది. ఇప్పుడు లక్ష్మి మక్కచేనుపై ఆశలు వదులుకున్నది. పీచు దశలో ఎండిపోయిన పంటను చూసి కన్నీళ్లు పెట్టుకోవడం మినహా చేసేదేమి లేక నిస్సహాయ స్థితిలో పడింది. కాలువ ద్వారా సరిపడా నీళ్లు వస్తే తన మక్క పంట పండేదని, ఎటూ సరిపోని నీళ్లు ఇస్తున్నారని, అందుకే పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. లక్ష రూపాయాల పెట్టుబడి మీద పడిందని వాపోతున్నది.
ఎస్సారెస్పీ పరిధిలో నీళ్లను ఆన్ ఆఫ్ పద్ధతిలో ఎనిమిది రోజులు విడుదల చేసి మరో ఏడు రోజులు నిలిపివేస్తున్నారు. ఈ ఎనిమిది రోజుల్లో 11ఆర్ కాలువకు రెండ్రోజులే మహా అయితే మరో రోజు మాత్రమే నీళ్లు వస్తున్నాయని చామన్‌పల్లి రైతులు వాపోతున్నారు. మళ్లీ నీళ్లు రావడానికి పది పన్నెండు రోజులు పడుతున్నదని, అప్పటి వరకు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామంలోని రాజసముద్రం చెరువుపై భాగంలో ఉన్న రైతుల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారింది. అందరికీ ఎనిమిది రోజుల పాటు వచ్చే నీళ్లు వీళ్లకు మాత్రం పది పన్నెండు రోజులకు రెండు మూడు రోజులు మాత్రమే వస్తుండడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఈ కారణంగా రైతులు సాగునీటి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన కష్టాలన్నీ ఇప్పుడు ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్నారు.
కాలువ ద్వారా నీళ్లు వచ్చినపుడు బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేక పోవడంతో అవి అడుగంటి పోతున్నాయి. వేసిన పంటలను రక్షించుకునేందుకు రైతులు బావుల్లో పూడికలు తీసుకుంటున్నారు. సైడు, నిలువు బోర్లు వేయిస్తున్నారు. కొత్త బోర్లు తవ్విస్తున్నారు. ఇప్పుడు పదుల సంఖ్యలో రైతులు ఇదే పనిలో నిమగ్నమై కనిపిస్తున్నారు. చామన్‌పల్లిలోని రాజసముద్రం పై భాగంలో ఎక్కడ చూసినా క్రెయిన్లు, బోరు బండ్ల మోతలే వినిపిస్తున్నాయి. వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి ఇంత కష్టపడుతున్నా.. వేసిన పంటలకు సరిపడా నీళ్లందక పంటలు మాడిపోతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జల వనరులు పుష్కలంగా ఉండేవి. ఏ చెరువు చూసినా నిండుగా కళకళలాడేవి. మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకుతూ కనిపించేవి. పచ్చని పంటలు దర్శనమిచ్చేవి. ప్రస్తుతం వేసవి సమీపించక ముందే యాసంగి పంటలు మాడి పోతున్నాయి. కనీసం ఇంకా రెండు నెలలైనా పంటలకు నీటి తడులు అవసరం ఉంటాయి. కానీ, ఈ పరిస్థితి గట్టెక్కేది ఎలాగని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పూర్తిగా వేసవి రాకముందే పంటలకు దిక్కు లేకుండాపోయిందని, ఎండలు ముదిరితే వందలాది ఎకరాల్లో పంటలు ఎండక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్ మండలం చామన్‌పల్లి, మొగ్దుంపూర్, నల్లగుంటపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రామన్నపేట, దేవునిమిట్ల, ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి, సిరికొండ, పెద్ద లింగాపూర్, ఒగులాపూర్ తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి.
ఇక గంగాధర మండలం నారాయణపూర్, మిడ్‌మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నీటిని అందిస్తున్న గన్నేరువరం, చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్ తదితర మండలాల్లో కొద్ది రోజుల్లోనే సాగునీటి కష్టాలు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి కాలువల ద్వారా సరిపడా నీళ్లు ఇవ్వాలని, చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ప్రత్యక్ష ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.