ముస్తాబాద్, ఫిబ్రవరి 25: రైతన్నకు సాగు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు లేక, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. ముస్తాబాద్ మండలంలో యాసంగి తొలి దశలో బోరు బావుల్లో సమృద్ధిగా నీరు ఉండడం, మల్లన్నసాగర్ నుంచి చెరువులు, కుంటలకు నీరు వస్తుందని, నక్కవాగులో నీరు ప్రవహిస్తే సమీప గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని ధీమాతో రైతులు అప్పులు చేసి పంటలు వేశారు. కానీ, రిజర్వాయర్ నుంచి నీరు రాకపోవడం, వేసవి ముదరక ముందే బావులు, బోర్లు అడుగంటిపోవడంతో సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.
పంటను కాపాడుకునేందుకు పలువురు రైతులు బోర్లు వేయిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సేవాలాల్తండాలో రైతు రవినాయక్ తన వరిలో పశువులను మేపుతున్నాడు. అలాగే కౌలు రైతు వసంతనాయక్ నాలుగెకరాలు సాగు చేసినా బోరులో నీళ్లు ఎల్లక సగం వరిని మేకలకు మేతగా వదిలేశాడు. ఇలా ఈ ఒక్క గ్రామంలోనే కాదు ఎక్కడ చూసినా రైతులు సాగు నీటి కోసం అరిగోస పడుతున్నారు.