జగిత్యాల, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో జగిత్యాలకు చెందిన ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ పెద్ద మొత్తంలో స్కామ్ చేయడం పది నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చట్టంలో ఉన్న చిన్నచిన్న లొసుగులను ఆధారంగా చేసుకొని ఏకంగా 32 సూట్‌కేస్ కంపెనీలను సృష్టించి వాటి పేరిట రూ.288 కోట్ల లావాదేవీలు నిర్వహించగా, ఈ విషయంపై గతేడాది డిసెంబర్లో ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు రాసి వెలుగులోకి తీసుకువచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలోనే జగిత్యాల పోలీసులు సదరు ట్యాక్స్ కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశారు. జగిత్యాలకు చెందిన చందా సాయికుమార్ జీఎస్టీ ప్రాక్టీషనర్ అయినందున ఎవరైనా కొత్తగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయాలన్నా, వివిధ కారణాలతో వ్యాపార సంస్థలు మూయాలన్నా ఆయన్నే సంప్రదించేవారు. ఈ క్రమంలోనే సదరు టాక్స్ కన్సల్టెంట్ అతడి వంకర బుద్దికి పదును పెట్టాడు. వ్యాపార సంస్థలు మూసివేయడానికి వ్యాపారస్తుల పాన్ నంబర్లు, ఆధార్ నంబర్లు సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించిన పాన్నంబర్లు, ఆధార్‌నంబర్ల ఆధారంగా వ్యాపార సంస్థను మూసివేయకుండా ఫోన్‌నంబర్లు మార్చి జీఎస్టీ చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని 32 బోగస్ కంపెనీలను తెరిచి వాటి ద్వారా వ్యాపారాలు కొనసాగుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించాడు. క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే, కాగితాలపైనే లావాదేవీలు నడుపుతున్నట్లు చూపించి తప్పుడు పత్రాలను జీఎస్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. ఇందులో అత్యధిక జీఎస్టీ స్లాబ్ ఉన్న సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసినట్లు కాగితాల్లో చూపించాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత విచారణ అంతా హైదరాబాద్‌లోని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పరిధిలోకి చేరింది. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
వాణిజ్య పన్నుల శాఖ పరమైన విచారణతో పాటు, పోలీస్‌శాఖ సైతం విచారణలోకి దిగింది. తీగలాగితే డొంక కదిలినట్లు ప్రస్తుతం అధికారులు విచారణ చేపడుతుండడంతో వివిధ రాష్ర్టాల్లోని పలు కంపెనీలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ బాగోతంలో 5 రాష్ర్టాలకు చెందిన డీలర్ల ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా ప్రభుత్వం సొమ్మును కొంత వరకు కట్టడి చేయగలిగినట్లు సమాచారం. జీఎస్టీ ప్రాక్టీషన్ను అరెస్ట్ చేసిన అధికారులు ఇప్పటి వరకు రూ.11కోట్లు వివిధ కంపెనీల నుంచి రికవరీ చేసినట్లు తెలుస్తోంది. బోగస్ సంస్థల ఖాతాల్లో జమ అయిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, గుజరాత్ రాష్ర్టాలకు చెందిన దాదాపు 350 మంది వ్యాపారులకు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా ఐటీసీ లబ్ధిపొందిన వారిలో తెలంగాణ రాష్ట్రంలో 302 మంది వ్యాపారస్తులు ఉండగా, మరో 48 మంది వివిధ రాష్ర్టాల్లో ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. ట్యాక్స్ కన్సల్టెంట్ బోగస్ వ్యవహారంలో 32 బోగస్ కంపనీల నుంచి రూ.288 కోట్ల ఐటీసీని దాదాపు 350 మంది ట్యాక్స్ పేయర్లకు బదిలీ అయినట్లు నిర్ధ్దారించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా రూ.120 కోట్ల ఐటీసీ మొత్తం ఆర్మూర్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఒక బోగస్ ఫర్మ్‌కు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. మిగిలిన మొత్తం హైదరాబాద్‌లోని పంజాగుట్ట, చార్మినార్, సరూర్లో గల బోగస్ కంపనీలకు ఐటీసీ బదలాయింపే జరిగినట్లు అధికారులు నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్ ప్రాక్టీషనర్ ఏర్పాటు చేసిన బోగస్ కంపెనీల నుంచి ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ పంపి ఆయా వ్యాపార సంస్థల నుంచి 20శాతం, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని కమిషన్ కింద పొందేవారని అధికారులు తెలిపారు. కాగా, భారీ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కంపెనీలు, ఏఏ రాష్ర్టాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి, వాటి పాత్ర, వాటిలోకి జమచేయబడిన ఇన్పుట్ సబ్సిడీ తదితర వివరాలన్నింటినీ అందజేయాలని కోరుతూ వాణిజ్య పన్నుల శాఖ జగిత్యాల అధికారి ఆనందరావు రాష్ట్ర డీజీపీకి ఇటీవల లేఖ రాసినట్లు సమాచారం. కాగా, వాణిజ్య పన్నుల శాఖతో పాటు, పోలీసుశాఖలు సంయుక్తంగా ఈ స్కామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో త్వరలోనే చార్జీషీట్‌ను దాఖలు చేయనున్నట్లు సమాచారం.