Peddapally | పెద్దపల్లి రూరల్, నవంబర్ 7 : పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులతో కొన్ని, అనుమతు లేకుండా మరి కొన్ని క్వారీలు అక్రమంగా నడుస్తున్న విషయంపై ఇటీవలికాలంలో కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఫిర్యాదులు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కడెక్కడ అనుమతులతో క్వారీలు నడుస్తున్నవి, అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నవి అనే వివరాలు తెలుసుకున్నారు.
అధికారులు పలు వివరాలతో ఆయా గ్రామాలను సందర్శించి మొరం(మట్టి) క్వారీలు, బండ క్వారీలపై విచారణ షూరూ చేశారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దికుంటలో మొరం(మట్టి)క్వారీని సందర్శించి అనుమతులు ఇచ్చినది ఎంత అక్కడి నుంచి తీసినది ఎంత అనేది లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే పెద్దపల్లి మండలంలోని బొంపల్లిలో గల ఓ వ్యక్తి బండ క్వారీపై బ్లాస్టింగ్ లు నడుస్తున్నాయని కలెక్టర్ తో పాటు భూగర్భగనులశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుకున్న అధికారులు భూగర్భగనులశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారుల బృందం క్వారీలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఎంత అనుమతులు, అక్రమంగా ఎంత కొల్లగొట్టారని లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి లెక్కలు తేలాక అక్రమంగా తరలించినట్లు తేలితే ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా భూగర్భ గనులశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.