Korutla | కోరుట్ల, ఏప్రిల్ 13 : కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహరావు పశు వైద్య కళాశాల, వెటర్నరీ యూనివర్సిటీ లో వెటర్నరీ ఫిజియాలజీ విభాగాధిపతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రాధాకృష్ణ పులి కంటి మీరట్‌లోని ఐఐఎంటీ యూనివర్సిటీలో నిర్వహించిన వైకాన్ 2026 అంతర్జాతీయ సదస్సులో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఈమేరకు సిక్కిం ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి అలోక్ కుమార్ శ్రీవాస్తవ చేతుల మీదుగా వైకాన్ గ్లోబల్ వెటర్నరీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు.
దేశవ్యాప్తంగా పశువైద్యులు, విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో చేసిన కృషికి ఈ అవార్డు రాధాకృష్ణకు దక్కింది. అలాగే హర్యానాలోని లాలా లజపత్ రాయ్ వెటర్నరీ అండ్ అనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ, హిసార్ ఉపకులపతి ప్రొఫెసర్ వినోద్ కుమార్ వర్మ చేతుల మీదుగా వెటర్నరీ ఎడ్యుకేటర్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్డును అందుకున్నారు. బోధన, విద్యార్థుల మార్గదర్శకత్వంలో చేసిన సేవలకు ఈ గౌరవం పొందారు. వెటర్నరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఐఐఎంటీ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, వైద్యులు, రైతులు పాల్గొన్నారు.