కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : అన్ని రంగాలకు ప్రాముఖ్యత కల్పించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కరీంనగర్ పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. జిల్లాలోని 33 మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.6.04 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదన్నారు. మహాలక్ష్మి పధకం కింద జిల్లాలో 4.97 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుని రూ. 208.57 కోట్ల లబ్ధిపొందారని తెలిపారు.
1,57,120 లబ్ధిదారులకు 6,33,737 గ్యాస్ సిలిండర్లను రూ. 500కే అందించామని ఇందుకుగాను రూ. 19.59 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గృహజ్యోతి కింద 1,58,875 సర్వీసులకు ఉచిత కరెంట్ అందించడం ద్వారా రూ. 6.94 కోట్లు వెచ్చించామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, జిల్లాలో 79,541 మంది రైతులకు రూ. 622.06 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 1,90,186 మంది రైతులకు రూ. 206.62 కోట్లు రైతు భరోసా ఇచ్చామన్నారు. రైతు బీమా కింద ఇప్పటి వరకు మరణించిన రైతులకు రూ. 23.45 కోట్లు అందించామని, ఈ సీజన్లో 65.312 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,483 మంది రైతు కూలీలకు రూ. 7.48 కోట్లు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. ఇంటి స్థలాలు ఉండి దరఖాస్తు చేసుకున్న 11,575 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఇందులో 5,672 పనులు ప్రారంభమై శరవేగంగా నడుస్తున్నాయని, లబ్ధిదారులు ఇప్పటి వరకు రూ. 32.30 కోట్లు విడుదల చేశామన్నారు.
భూభారతిలో 31,224 దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానల్లో 3,278 ప్రసవాలు నిర్వహించామని, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 12,889 మందికి రూ. 36.60 కోట్ల విలువైన శస్త్ర చికిత్సలు చేయించామన్నారు. ఆరోగ్య మహిళ కింద మహిళలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా గత యాసంగి సీజన్లో 3,10,742 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు రూ. 720.85 కోట్లు చెల్లించామన్నారు. 37,028 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి 73,644 మంది కుటుంబ సభ్యులకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో మొత్తం 2,90,402 రేషన్ కార్డులకు ప్రతి నెలా 5,583 టన్నుల సన్న బియ్యం అందిస్తున్నామని, 519 సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు 364 టన్నుల ఫోర్టిఫైడ్ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోందని, బ్రిక్స్ టూ బుక్స్, విద్యా వాహిని, వాయిస్ ఫర్ గర్ల్స్, కాన్షియెనసెస్ క్లబ్, టెడ్ ఎట్ టాక్స్, బుధవారం బోధన, ఇంగ్లీష్ క్లబ్, విటమిన్ గార్డెన్ వంటి వినూత్న కార్యక్రమాలను పాఠశాలల్లో అమలు చేస్తున్నామని అన్నారు.
డీఆర్డీఏ ద్వారా 2,058 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 208.77 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామని, 1,946 మంది మహిళలకు రూ. 18.13 కోట్ల స్త్రీ నిధి రుణాలు ఇచ్చామని, దూర విద్యను అభ్యసించేందుకు 3,622 మందికి అడ్మిషన్లు ఇచ్చామని వివరించారు. ఉపాధి హామీ పథకం కింద 1,23,960 జాబ్ కార్డులు జారీ చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 15.40 లక్షల పనిదినాల ద్వారా కూలీలు ఉపాధి కల్పించామన్నారు. 1,36,237 మందికి ప్రతి నెలా రూ. 32 కోట్ల చేయూత పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ద్వారా డ్రగ్స్‌పై విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, ఉపకార వేతనాలు, కాస్మోటిక్ చార్జీలు 40 శాతం పెంచామని చెప్పారు. వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ మేడిపల్లి సత్యం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.