ఈత సరదా.. కారాదు విషాదం
ఎండకాలం వచ్చేసింది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్నారు.
- పిల్లలు, యువకుల్లో స్విమ్మింగ్‌పై ఉత్సుకత
- చెరువులు, కుంటలకు వెళ్లి ప్రమాదాల బారిన
- ఏటా పదుల సంఖ్యలో గాల్లో కలుస్తున్న ప్రాణాలు
- జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు
- తల్లిదండ్రులూ ఓ కంట కనిపెట్టాలని సూచనలు
ఏప్రిల్ 14 : సెలవు రోజు కావడంతో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు ముగ్గురు విద్యార్థులు వెళ్లారు. వీరు ముగ్గురూ 15 ఏండ్లలోపు వారు కావడం, ఎవరికీ ఈత రాకపోవడంతో చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
మార్చి 7 : హోలీ పండుగ కావడంతో తోటి స్నేహితులతో ఆనందంగా వేడుక జరుపుకున్న ముగ్గురు విద్యార్థులు స్నానం కోసం కరీంనగర్ శివారులోని వాగులోని ఓ గుంతలో దిగారు. వీరు కూడా 15 ఏండ్లలోపు వారు కావడం, ఎవరికీ ఈత రాకపోవడంతో గుంతలోనే మునిగి మృత్యువాతపడ్డారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలు కేవలం నెలన్నర వ్యవధిలోనే కాగా, రెండూ సెలవు రోజుల్లో జరిగినవే. ఈ ఘటనల్లో చిన్నారులందరూ 15 ఏండ్ల లోపు వారు కావడం, సరదా కోసం వెళ్లడం, ఎవరికీ ఈత రాకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం, వీరితో పెద్దవాళ్లు ఎవరూ లేకపోవడంతోనే ఇంత ఘోరం జరిగింది. ఫలితంగా అందరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నారులూ.. సరదాగా చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, బావుల్లో ఈతకు వెళ్లాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త. తల్లిదండ్రులూ.. వారిని ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత మీదే.
జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 19 : ఎండకాలం వచ్చేసింది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్నారు. ఈతలు కొడుతూ కేరింతలు కొడుతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, ఈత నేర్చుకోవడానికి మరి కొందరు, సరదాగా గడిపేందుకు ఇంకొందరు.. నీళ్లలో దూకి తమ ఈత ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇక పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తర్వాతనైతే విద్యార్థుల ఆటపాటల్లో ఈత ఓ భాగమైపోయింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈత విహారం విషాదానికి దారితీస్తున్నది. వినోదాన్ని పంచిన ఆ నీరే.. చీకట్లోకి నెట్టివేస్తున్నది. నీటిలో చేపపిల్లలా ఈదుతూ గెంతులేసిన పిల్లలు.. అదే నీటిపై విగత జీవులుగా తేలియాడాల్సి వస్తున్నది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లితండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. నీటి విషయంలో అవగాహన లేకపోవడం, తోటి వారు ఈత కొడుతుండగా ఉత్సాహాన్ని ఆపుకోలేక, ఈత రాకున్నా నీటిలోకి దిగడం, ప్రవాహ నీటిలో ఈత కొట్టడం, చెరువులు, బావులు, కాలువల్లో ఈత పేరుతో ప్రయోగాలు చేయడం, చేపలు పట్టేందుకు పెట్టిన వైర్లకు తగిలి విద్యుత్ షాక్‌కు గురికావడం వంటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఒంటరిగా ఈతకు వెళ్లరాదు.
- పదిహేనేండ్ల లోపు వయసు వారిని ఒంటరిగా ఈతకు వెళ్లనీయొద్దు.
- చిన్నారుల భద్రతను మరో చిన్నారిపై ఉంచొద్దు. తప్పనిసరిగా తండ్రి లేదా పెద్దవారు వెంట ఉండాలి. పిల్లల ఈతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.
- తల్లిదండ్రుల, పెద్దల అనుమతి తీసుకుని పూర్తి స్థాయి రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతే ఈతకు వెళ్లాలి.
- ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే వెళ్లాలి.
- ఈత నేర్చుకునే సమయాల్లో గాలి ట్యూబులు, ఇతర రక్షణ కవచాలను నడుముకు, హ్యాండ్ ట్యూబులు కట్టుకోవాలి.
- పెద్దలు, శిక్షకుల సమక్షంలోనే ఈత నేర్చుకోవాలి.
- నీటిలో అడుగు భాగాలకు వెళ్లి మట్టిని తేవడం, ఎవరు ఎక్కువ సేపు నీటిలో మునిగి ఉంటారనే పోటీలు, ఇతర ఆటలు ఆడవద్దు.
- నీటిలో ఎక్కువ సేపు మునిగి ఉండవద్దు.
- నదులు, కాలువల్లో ఈత కొట్టవద్దు.
- తల వెంట్రుకలు కండ్ల్లలోకి రాకుండా హెడ్ క్యాప్, చెవుల్లోకి నీళ్లు పోకుండా ఇయర్ ప్లగ్‌లను ఉపయోగించాలి.
- ఈతకు వెళ్లే ముందు ఎక్కువగా ఆహారం తీసుకోరాదు.
- హృద్రోగులు, మూర్చ, హైబీపీ ఉన్న వారు నీటిలోకి వెల్లకపోవడమే మంచిది.
- ఈతకు వెళ్లే సమయంలో సెల్ ఫోన్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్లాలి.
- నీటిలో మునిగిన వ్యక్తిని, కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసే వారు సైతం రక్షణ చర్యలు తీసుకోవాలి.
- నీటిలో ప్రమాదం జరిగినప్పుడు ఒడ్డున ఉన్న వారు కేకలు వేస్తూ సమీపంలోని పెద్దవారికి సమాచారాన్ని చేరవేయాలి.
నీటి ప్రమాదాలకు ప్రధాన కారణాలు
- చెరువులు, బావుల్లో నీటి లోతు తెలుసుకోకపోవడం, దరికి దూరంగా ఈత కొట్టుకుంటూ వెళ్లే క్రమంలో అలసిపోవడం, అక్కడి నుంచి వెనుకకు వద్దామన్నా రాలేక.. ఊపిరాడక నీటిలో మునిగిపోవడం.
- స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లే సందర్భాల్లో పోటీలు(బెట్) పెట్టుకోవడం.. ఒకరి కంటే ఎక్కువ దూరం ఈదాలనే పట్టుదలతో వెళ్లి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయి నీటిలో మునిగిపోవడం.
- తోటి వారు ఈత కొడుతుండగా ఉత్సాహాన్ని ఆపుకోలేక నీటిలోకి దిగి ఈత రాక మునిగిపోవడం.
ఈత నేర్చుకునే సమయంలో నడుముకు కట్టుకున్న ట్యూబు, ఇతర పరికరాలు ఊడిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. - యువకులు మద్యం మత్తులో బావులు, చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్లే సందర్భాల్లోనూ ప్రమాదం జరగొచ్చు.
నీటి ప్రవాహానికి ఎదురీదడం, చెరువులు, కాలువ, బావి గట్ల వద్ద సెల్ఫీలు దిగే సందర్భంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృత్యువాత పడే అవకాశం ఉన్నది. - ఎక్స్కవేటర్స్తో వ్యవసాయ బావులు తవ్వుతున్నందున ఒక వైపు కొద్ది దూరం ఏటవాలుగా ఉండడం, తర్వాత లోతు ఉండడం గమనించకపోవడం వల్ల నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది.
తలిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు, యువకులు జలాశయాలు, కాలువల్లో ఈతకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి. ఈత కొట్టే సమయంలో పెద్దలు వెంట ఉండాలి. ఈత రాని పిల్లలను ఒంటరిగా చెరువులు, బావులు, జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడాలి. తల్లిదండ్రులు, పెద్దలు, నిపుణుల సమక్షంలోనే ఈత నేర్చుకునేలా చూడాలి. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో జలాశయాలు, కాలువల వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి. నీటి ప్రమాదాలు జరుగకుండా పోలీసు శాఖ ద్వారా చర్యలు తీసుకుంటాం.
– జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్
ప్రాణాలు కాపాడుదామిలా..
ఎవరైనా నీటిలో మునిగిన సమయాల్లో ఒడ్డున ఉన్న వారు గమనిస్తే వెంటనే వారిని ఒడ్డుకు చేర్చి శ్వాస ప్రక్రియను గమనించాలి. బాధితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే నోటిలోంచి గాలిని పంపించే ఏర్పాట్లు చేయాలి. చాతిపై రెండు చేతులతో ఒత్తిడి చేస్తూ శ్వాసక్రియ సరిగ్గా జరిగేలా చూడాలి. నీళ్లు మింగితే వెల్లకిలా పడుకోబెట్టి పొట్టను నెమ్మదిగా ఒత్తిపడుతూ నీటిని నోటి ద్వారా బయటకు వెళ్లేలా చేయాలి. నీళ్లు కక్కించిన తర్వాత బాధితుడిని కుడివైపు తిప్పి పడుకోబెట్టాలి. శ్వాస తీసుకునే విధానాన్ని పరిశీలించాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడితే, స్పృహలో లేకున్నా వెంటనే సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందేలా చూడాలి.
– డాక్టర్ మల్లారెడ్డి, ఎండీ
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

