రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)/ గంభీరావుపేట: నాలుగు రోజులపాటు వర్షాలు విస్తృతంగా పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలని, మొద్దునిద్ర వీడి ప్రజలను అప్రమత్తం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, వరద బాధితులను ఆదుకోవాలని, వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు, నష్టపోయిన పంట ఎకరానికి 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
గురువారం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు, సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటించారు. నర్మాలలో మానేరువాగులో చిక్కుకొని అధికారుల సాయంతో సురక్షితంగా బయటికి వచ్చిన రైతు పిట్ల నర్సింహులును పరామర్శించారు. గల్లంతైన నాగయ్య బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వానకాలం సందర్భంగా చేపట్టాల్సిన సన్నద్ధతను పట్టించుకోలేదని, ఈ విపత్తును ముందే ఊహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సహాయ చర్యలు చేపట్టంలోనూ వైఫ్యలం చెందిందని నిప్పులు చెరిగారు.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించాలన్న ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లేదని, వాగులో ఆరుగురు రైతులు చిక్కుపోవడం, ఒకరు గల్లంతుకావడం బాధాకరమన్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన హెలీకాప్టర్లు బిహార్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తిరగడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం జరిగిందని, అందుకే ఒక రోజు తర్వాత నేవీ హెలీకాప్టర్లు ఉపయోగించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో వరదల్లో చికుకున్న ప్రజలను రక్షించడానికి సత్వరంగా హెలీకాప్టర్లను పంపి వారి ప్రాణాలను కాపాడిన సందర్భాన్ని గుర్తుచేశారు. అనంతరం నాగంపేటలో వర్షానికి ఇల్లు కూలిన కంకణాల జలందర్ను కేటీఆర్ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
ప్రభుత్వ పెద్దలు మొద్దు నిద్రలో ఉన్నా 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించి, వాగులో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నించిన అధికారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. మీడియా కూడా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందని ప్రశంసించారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు తాగునీరు, ఆహారాన్ని అందిస్తున్నారని పేర్కొన్న ఆయన, సహాయక చర్యల్లో పాల్గొంటున్న శ్రేణులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలో పార్టీ తరపున వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కామారెడ్డి జిల్లాకు బయలుదేరారు. మార్గమధ్యంలో కామారెడ్డి – కరీంనగర్ ప్రధాన మార్గంపై మాచారెడ్డి మండలంలోని పాల్వంచ సమీపంలో పాల్వంచ వాగు ఉధృతిని పరిశీలించారు. అయితే రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతంగా బ్రిడ్జి పైనుంచి ప్రవహించడంతో కామారెడ్డికి వెళ్లడం సాధ్యం కాక అకడి నుంచి తిరిగి సిరిసిల్లకు వెళ్లారు. వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో పాలుపంచుకొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయన వెంట ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి,మండలాధ్యక్షుడు వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, లింగన్నగారి దయాకర్రావు, గూడూరి ప్రవీణ్, గుండారపు కృష్ణారెడ్డి, ద్యానబోయిన రాజేందర్, ఎడబోయిన రాజు, కిశోర్, రత్నాకర్, మోతె రాజిరెడ్డి, రాజారాం, రాజు, రాజేందర్, నాగరాజు గౌడ్ ఉన్నారు.