రామడుగు, జూలై 30: భారీ వరదలతో నష్టపోయిన బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న మోతె వంతెనతో పాటు వాగు ధాటికి కొట్టుకుపోయిన వ్యవసాయ భూములు, రామడుగు వంతెనను ఆదివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావుతో కలిసి సందర్శించారు. మోతె శివారులో కొట్టుకుపోయిన వ్యవసాయ భూములను పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. ఆకారం కోల్పోయిన వంతెనను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోతె వంతెన వద్ద సుమారు పదెకరాలకు పైగా రైతులు వ్యవసాయ భూములు దెబ్బతిన్నట్లు తెలుసుకొన్నారు. ముందుగా జల వనరులశాఖ, పంచాయతీరాజ్‌శాఖ, రోడ్ల, భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వంతెన వద్ద వరదతో వచ్చి ఇరుక్కుపోయిన ముళ్లపొదలు, చెట్లను తొలగించాలని సూచించారు. తాత్కాలికంగా రహదారి నిర్మించాలని ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెరిపిలేని వర్షాలతో మోతెవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నదన్నారు. మోతె వంతెనవద్ద వరదనీరు వెళ్లే దారిలో ముండ్ల కంపలు, చెట్ల పొదలు చిక్కుకోవడంతో మోతెవాగు తన దిశను మార్చుకొని వంతెన సమీపంలో కొత్తపల్లి నుంచి రామడుగు మండలం మీదుగా గంగాధరకు వెళ్లే దారిని పూర్తిగా కోసుకొని పోయిందన్నారు. ఈ కోతతో పక్కనే ఉన్న రైతుల వ్యవసాయ భూములు సుమారు పదెకరాల వరకు రెండు నుంచి మూడు మీటర్ల లోతులో కోతపడడం బాధాకరమన్నారు. భారీ నష్టంపై ఆదివారం ఉదయమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో మాట్లాడడం జరిగిందన్నారు. ఇక్కడ జరిగిన నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోతపడ్డ భూములను రీస్టోర్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటి నష్టం జరుగకుండా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. దెబ్బతిన్న మోతె వంతెన స్థానంలో హైలెవల్ వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలో రహదారులు, వంతెనలతో పాటు పంటలు, పలువురు రైతుల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని, జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం వినోద్‌కుమార్, ఎమ్మెల్యే దేశరాజ్‌పల్లి మత్తడి వద్ద ఆగి అలుగు నీరు పారే కల్వర్టును పరిశీలించారు. ఇక్కడ కూడా హైలెవల్ వంతెన నిర్మిస్తామన్నారు. దేశరాజ్‌పల్లి ఊర చెరువు కట్టపై సీసీరోడ్డు నిర్మించాలని స్థానిక ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎల్కపెల్లి లచ్చయ్య వినోద్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి వరద నీటితో పూర్తిగా దెబ్బతిన్న రామడుగు వంతెనను పరిశీలించారు. కొత్త వంతెనను కొద్దిరోజుల్లోనే ఉపయోగంలోకి తెస్తామని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. పాత వంతెనపై తాత్కాలికంగా ప్రయాణించే ఏర్పాట్లు చూడాలని ఎమ్మెల్యేతో పాటు అధికారులను ఆదేశించారు.
ఇక్కడ ఎంపీపీ కలిగేటి కవితాలక్ష్మణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, చొప్పదండి బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గంట్ల జితేందర్‌రెడ్డి, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, రామడుగు, చొప్పదండి ఏఎంసీ చైర్మన్లు మామిడి తిరుపతి, గడ్డం చు క్కారెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డీనేటర్ జూపాక కరుణాకర్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బండ అజయ్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బత్తిని తిరుపతిగౌడ్, గడ్డం మోహన్‌రావు, మీస లచ్చయ్య, శనిగరపు అనిల్‌కుమార్, మోతె సర్పంచు అంబటి నారాయణ, పలు గ్రామాల సర్పంచులు వొంటెల అమరేందర్‌రెడ్డి, జవ్వాజి శేఖర్, ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎల్కపెల్లి చల్చయ్య, బీఆర్ఎస్ నాయకులు వూకంటి చంద్రారెడ్డి, తౌటు మురళి, వొంటెల వెంకటరమణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎడవెల్లి మల్లేశం, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, జూపాక మునీందర్, చాడ శేఖర్‌రెడ్డి, పూడూరి మల్లేశం, బ త్తిని మునయ్యగౌడ్, సైండ్ల కరుణాకర్, పైండ్ల శ్రీనివాస్, లంక మల్లే శం,పెంటి శంకర్,మాదం రమేశ్,చిరుత రాంచంద్రం పాల్గొన్నారు.