ముకరంపుర, డిసెంబర్ 16 : యాసంగిలో రైతులు ఎక్కువగా మక్క సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలో ‘కాండం తొలుచు’ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్షకులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాంతీయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మంజులత వివరించారు.
పురుగు వ్యాప్తి చెందే విధానం
పంట వేసిన 10-20 రోజుల మధ్య ఎక్కువగా కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. పిల్ల పురుగులు ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకుని ఉన్న ఆకు ద్వారా కాండంలోకి చేరుతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది మాదిరిగా రంధ్రాలు వరుస క్రమంలో కనిపిస్తాయి. పురుగు కాండం దగ్గర రంధ్రం చేసుకుని, లోపలి పదార్థాన్ని తింటూ కాండాన్ని డొల్లగా చేస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది.
నివారణ
రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా కాండం తొలుచు పురుగును సమర్ధవంతంగా నివారించవచ్చు. పొలంలో కలుపు మొక్కలు, చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను చేనులో నుంచి తీసేసి నాశనం చేయాలి. పొలం చుట్టూ నాలుగు వరుసల్లో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. క్లోరాంట్రినిలిప్రోల్ మందును ఎకరాకు 60 మి.లీ, లీటరు వేప నూనె(1500 పీపీఎం)ను 200లీటర్ల నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10-12 రోజులకు పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25-30 రోజులకు ఆకుల సుడుల్లో వేయాలి. లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8-10 అమర్చినట్లయితే కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.