CPM State Secretary John Wesley | కోల్ సిటీ, అక్టోబర్ 25: ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో ఎంత మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చారు..? అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా.. జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జాన్ వెస్లీ సీపీఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, కే భూపాల్ తో కలసి అసిఫాబాద్ పర్యటనకు శనివారం వెళ్తుండగా గోదావరిఖని వద్ద సీపీఎం జిల్లా నాయకత్వం ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో దాగుడు మూతలు ఆడటం మానుకోవాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పేద మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయనీ. మన రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకోవడానికి అది ఒక సాకుగా చూపుతుందన్నారు.
బీజేపీ ఎంపీలు, మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందనీ, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం మోసపూరితమేనని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ప్రకటించి వాటి భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ ఆందోళనకు సీపీఎం తరపున మద్దతు ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లాలో పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు చేసి గుడిసెలు వేసుకొన్నారని, వారికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సొంతిల్లు లేని అర్హులైన వారిని గుర్తించి వెంటనే ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఇది జరగకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, ఏ.మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, రాజారెడ్డి, భిక్షపతి, శైలజ, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.