జగిత్యాల జిల్లాలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య అంతర్యుద్ధం నెలకొన్నది. తమ మాట చెల్లుబడి కావాలంటూ పట్టుబడుతుండడంతో పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్గతంగా నెలకొన్న ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, ఇటు ప్రభుత్వ అధికారులు, అటు ప్రజలు.. ఇలా అన్ని వర్గాలు వారు సమస్యల పాలవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య చెలిమి, అనుబంధం పైకి కనిపిస్తున్నంత సఖ్యంగా లేవని, అవన్నీ జనాలకు చూడడానికి మాత్రమేనన్న విమర్శలు వస్తున్నాయి.
జగిత్యాల, జనవరి 19(నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో పాలనా వ్యవస్థ అయోమయం.. జగన్నాథం అన్నట్లుగా మారింది. అంతర్గతంగా నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలు కొని, ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులు, ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపిక వరకు ఇబ్బందులే ఎదురువుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం నిలిచిపోయిందని, అధికారుల బదిలీలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇందిరమ్మ కమిటీలకు పడని ఆమోద ముద్ర
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. గతేడాది అక్టోబర్ 11న జీవో 33 జారీ చేసింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం ఇస్తామని, లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ కమిటీలు చేస్తాయని ప్రకటించింది. గ్రామ స్థాయిలో సర్పంచ్/స్పెషల్ ఆఫీసర్ ఇందిరమ్మ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉంటారని, గ్రామ కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్లు/వార్డు అధికారులు ఉంటారని తెలిపారు. గ్రామం నుంచి ముగ్గురు సభ్యులను ఎంపిక చేయాలని, అందులో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉండాలని నిర్ణయించారు. కమిటీలో ఖచ్చితంగా 50 శాతం మహిళలు ఉండాలని నిబంధనలు పెట్టారు. జగిత్యాల జిల్లాలో 514 ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, సభ్యుల ఎంపిక విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేకు, ఆ పార్టీలో సీనియర్‌గా ఉన్న ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య సభ్యుల ఎంపిక విషయంలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయి.
దీంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో రెండేసి జాబితాలు తయారై, అధికారులకు నివేదించబడ్డాయి. కోరుట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక జాబితా నివేదించగా, కాంగ్రెస్ ఇన్చార్జి మరో జాబితాను అధికారులకు అందజేశారు. ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన వారిలోనే పొరపెచ్చులు రావడంతో ఇందిరమ్మ సభ్యుల జాబితా తయారీలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇక చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండలాల్లోనూ సమస్యలు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు ఇందిరమ్మ కమిటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేయలేదు. ఫలితంగా అటు ఇందిరమ్మ కమిటీల జాబితాల్లో పేరున్న వారు, ఇటు ప్రభుత్వ అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. జిల్లాలో 2,03,011 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, వారందరి గురించి సర్వే నిర్వహించి, వివరాలు ఆన్లైన్ చేశారు. ఈ రోజు లేదా రేపో 360 డిగ్రీల యాప్ ఆధారంగా గ్రామాలు, వార్డుల వారీగా లబ్ధిదారుల జాబితా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. జాబితా ప్రకటన తర్వాత ఈ నెల 21 నుంచి 24 తేదీల మధ్య గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలు సమావేశాలు నిర్వహించి, తొలి 3500ల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అయితే, ఇంత వరకు ఇందిరమ్మ కమిటీలకే ఆమోదముద్ర పడకపోవడంతో గ్రామ సభులు ఎలా నిర్వహించాలి?, లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య సమన్వయం లేక ఇష్టారాజ్యంగా జాబితాలు సమర్పించడం వల్లనే కమిటీల ఎంపిక జరగడం లేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నియామకంలోనూ ఆధిపత్య పోరే
జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు పోస్టింగులు ఇవ్వడం, బదిలీలు చేసే విషయంలోనూ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొందన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జరిగిన కొన్ని బదిలీలు, పోస్టింగులు అందరినీ విస్మయానికి గురి చేశాయి. జిల్లాకు కొన్ని నెలల క్రితం బదిలీపై వచ్చి, మూడు నాలుగు నెలలు సైతం పనిచేయకముందే ఒక జిల్లా ఉన్నతాధికారి బదిలీ అయ్యారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకున్నా సదరు అధికారి బదిలీ కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. తనను ఎందుకు బదిలీ చేశారో అర్థం కాక సదరు అధికారి ఇతర ఉద్యోగుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏడాది క్రితం వరకు ఇదే జిల్లాలో పనిచేసి మరో జిల్లాకు బదిలీపై వెళ్లిన ఉద్యోగి ఐదారు నెలల వ్యవధిలోనే బదిలీపై తిరిగి వచ్చారు. ఈ బదిలీ అందరినీ ఆశ్చర్యపరిచింది. అవినీతి ఆరోపణలు ముఖ్యంగా బియ్యం లెవీ విషయంలో ఉన్న సదరు అధికారి తిరిగి రావడం అందరికీ సందేహాన్ని కలిగించింది.
బదిలీ ఉత్తర్వులు తీసుకొని సదరు అధికారి విధుల్లో చేరేందుకు కార్యాలయానికి రాగా, జిల్లాకు చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి సదరు అధికారిని విధుల్లోకి తీసుకోవద్దని అడ్డు చెప్పడంతో కొంత సేపు ఆయోమయ పరిస్థితి నెలకొన్నట్లు ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. చివరకు బదిలీపై వచ్చిన అధికారి రాజధాని స్థాయిలో ఉన్నతాధికారులు, మంత్రుల స్థాయి ప్రజాప్రతినిధులతో సంప్రదించి, జిల్లా కీలక ప్రజాప్రతినిధితో పాటు మరో ప్రజాప్రతినిధి, పెద్ద మొత్తంలో నజరానా ముట్టజెప్పడంతో విధుల్లో చేర్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి తన మాట వినడం లేదని, నజరానాలు సమర్పించడం లేదన్న మిషతో కీలక విభాగంలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారిని బదిలీ చేయించి మరో అధికారిని తెచ్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే, జిల్లాలో రాజకీయ సంచలనాలకు కేంద్రమవుతున్న ప్రజాప్రతినిధి తన పరిధిలో అన్ని కీలక శాఖలకు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉండాలన్న లక్ష్యంతో తన వారినే భర్తీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో సీనియర్ నాయకుడు, ప్రజాప్రతినిధికి మద్దతు పలికే ఉద్యోగులు, సన్నిహితులుగా గుర్తింపు పొందిన ఉద్యోగులందరినీ జిల్లా నుంచి వెళ్లగొట్టేందుకు పలు బదిలీలు చేయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జాడ లేని మార్కెట్ కమిటీల నియామకం
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో రెండు మార్కెట్ కమిటీలు ఉండగా, రెండింటికి పాలకవర్గాలను ఇంత వరకు నియమించలేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయాలన్నీ తారుమారు అయిపోయాయి. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి జగిత్యాల, రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు, పాలకవర్గానికి కొందరు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లను ఏడాది క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మరికొందరి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో చిక్కుల్లో పడ్డ అధికారులు ఎవరినీ ఎంపిక చేయకుండా వదిలిపెట్టారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి రెండు సీజన్లు పూర్తయి, మూడో సీజన్ ప్రారంభమైనా ఇంకా కమిటీల ఏర్పాటు జరగకపోవడంపై రైతులు, కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రంథాలయ చైర్మన్ ఎంపికలోనూ జాప్యం
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంపిక విషయంలోనూ తీవ్రమైన జాప్యం నెలకొన్నది. జిల్లాస్థాయి పోస్టు కావడంతో మూడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవిని ఆశిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ఒక సీనియర్ నాయకుడికి చైర్మన్ పోస్టు కట్టబెట్టాలని ప్రభుత్వ విప్ ప్రయత్నించారు. అలాగే, కోరుట్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు సైతం అదే పదవిని ఆశిస్తూ వచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దళిత వర్గానికి చెందిన సీనియర్ కార్యకర్తకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే, సదరు దళిత నాయకుడికి పదవి ఇవ్వడం ఇష్టంలేని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న మరో నాయకుడి పేరును ప్రతిపాదిస్తూ సిఫారస్ చేశారు. దీంతో చైర్మన్ ఎంపికలోనూ ప్రతిష్టంభన ఏర్పడింది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి భర్తీ విషయంలో చక్రం తిప్పిన జగిత్యాల ఎమ్మెల్యే తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నిర్ణయాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తె లుస్తోంది. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జితో ఉన్న బంధుత్వాన్ని ఆసరాగా చేసుకొని, చొప్పదండి ఎమ్మెల్యే, ధర్మపురి ఎమ్మెల్యేను ఒప్పించి, ఎమ్మెల్యే ప్రతిపాదించిన దళిత వర్గానికి చెందిన నాయకుడికి కాకుండా, తన సామాజిక వర్గమైన కోరుట్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడి పేరును ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఏడాది గడిచినా జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టు భర్తీకాకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇష్టారాజ్యంగా పాలన సాగుతుండడంతో అటు ప్రజలు, ఇటు అధికారులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.