ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తిప్పలు తప్పడం లేదు. ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. దూర భారాన్ని పరిగణలోకి తీసుకోకుండా రీచ్‌లు కేటాయించింది. దీంతో రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని ఇండ్లకు మార్కౌట్ ఇచ్చిన అధికారులు ఇసుక సరఫరాకు ఎలాంటి ఆటంకాలూ లేవని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. క్వారీలు దూరంగా ఉండడంతో ఆర్థిక భారం పడుతున్నదని ఆవేదన చెందుతున్నారు. అంతే కాకుండా, ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు అంటే ఎనిమిది ట్రిప్పులు మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. నాలుగు దశల్లో కార్యదర్శుల ద్వారా కూపన్లు జారీ చేస్తున్నారు. ఎక్కువ అవసరం ఉంటే పరిస్థితి ఏంటని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇసుక అతి ముఖ్యమైన ముడి సరుకు. ఇప్పుడు ఇది లబ్ధిదారులకు అత్యంత ఖరీదైనదిగా మారింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పినా అది తెచ్చుకోవడం లబ్ధిదారులకు భారంగా మారుతున్నది. దూర ప్రాంతాలకు వెళ్లి ఇసుక తెచ్చుకోవాల్సి వస్తున్నది. ఇసుక ఉచితంగా సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాం గం కొన్ని రీచ్‌లను గుర్తించింది. రీచ్‌ల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తెచ్చుకునేందుకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు కూపన్లు ఇచ్చింది. అవి తీసుకుని సంబంధిత హౌసింగ్ ఏఈతో అటెస్టెడ్ చేయించుకుని వారికి కేటాయించిన రీచ్‌కు వెళ్లి ఇసుక తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని గ్రామాల్లోనే కాకుండా చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, శంకరపట్నం, సైదాపూర్, తదితర మండలాల్లో ఇసుక రీచ్‌లు లేవు.
చొప్పదండి మండలం, పట్టణానికి చెందిన లబ్ధిదారులు ఇసుక తెచ్చుకోవాలంటే కరీంనగర్ మండలం ఇరుకుల్ల, చేగుర్తికి వెళ్లాల్సి ఉంటుంది. సైదాపూర్ లబ్ధిదారులైతే వీణవంక మండలం చల్లూరు, జమ్మికుంట మండలం తనుగులకు వెళ్లి ఇసుక తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉన్నది. గంగాధర మండలం పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ మండల లబ్ధిదారులు రామడుగు మండలం మోతె, కరీంనగర్ మండలం ఇరుకుల్ల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మండలాలకు కేటాయించిన రీచ్‌లు దూరంగా ఉండడంతో ట్రాక్టర్ల యజమానులు పెద్ద మొత్తంలో రవాణా చార్జీలు అడుగుతున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రాక్టర్‌కు 3 వేల నుంచి 5 వేలు అడుగుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఇసుక తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కొలతల ప్రకారం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులలోపు నిర్మించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందుకు 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని, ట్రాక్టర్ల రవాణా చార్జీలు చెల్లించి తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 25 క్యూబిక్ మీటర్లు అంటే ఒక ఇంటికి 8 ట్రిప్పులు మాత్రమే వస్తుంది. ఇది కూడా నాలుగు దశల్లో ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, ఇచ్చే ఇసుక అధికారుల లెక్కల ప్రకారం 400 చదరపు అడుగులకు మాత్రమే సరిపోతుంది. 600 చదరపు అడుగుల్లోనూ ఇల్లు నిర్మించుకోవచ్చని చెబుతున్న నేపథ్యంలో చాలా మంది 24 ఫ్లీట్ల పొడవు, 24 ఫీట్ల వెడల్పు చొప్పున ముగ్గులు పోసుకుంటున్నారు. ఇలాగైతే 576 చదరపు అడుగులు వస్తున్నది.
అంటే ప్రభుత్వం కేవలం 400 చదరపు అడుగుల నిర్మాణానికి అవసరమైన ఇసుకను మాత్రమే సరఫరా చేస్తామని చెబుతున్నది. సాధారణంగా 576 చదరపు అడుగుల చొప్పున కొలతలు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక ఇస్తారా..? ఇవ్వరా..? అనేది సందేహంగానే ఉంది. అధికారులు ఇచ్చేది కేవలం 400 చదరపు అడుగులకే అయితే, మిగతా ఇసుక ఎలా సమకూర్చుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. వేబిల్ చెల్లించి ఇవే రీచ్‌ల నుంచి అనుమతి ఇస్తారా..? లేదంటే మీరే సమకూర్చుకోవాలని లబ్ధిదారులపైనా భారం వేస్తారా..? అనేది తెలియడం లేదు..
కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేసేందుకు కొన్ని రీచ్‌లను గుర్తించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల, చేగుర్తిలో గుర్తించిన రీచ్ ద్వారా చొప్పదండి, గంగాధర, కరీంనగర్ రూరల్, నగరంలోని లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. రామడుగు మండలం మోతె, వన్నారం, కొక్కెరకుంట, పోరెపల్లి, రామడుగు వాగుల నుంచి రామడుగు మండలంలోని గ్రామాలకు, జమ్మికుంట మండలం తనుగుల, విలాసాగర్ రీచ్‌ల నుంచి ఇల్లందకుంట, జమ్మికుంట రూరల్, పట్టణ లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు.
ఇక హుజూరాబాద్ రూరల్, పట్టణ లబ్ధిదారులకు జమ్మికుంట మండలం తనుగుల, వీణవంక మండలం చల్లూరు, ఇప్పలపల్లి నుంచి, వీణవంక మండలానికి తనుగుల, ఇప్పలపల్లి, మల్లారెడ్డిపల్లి నుంచి, కొత్తపల్లి రూరల్, పట్టణానికి ఖాజీపూర్, ఎలగందుల నుంచి, గన్నేరువరం మండలానికి బిక్కవాగు, చొక్కారావుపల్లి నుంచి, మానకొండూర్ మండలానికి, కరీంనగర్ నగర పరిధిలోని అల్గునూర్, సదాశివపల్లికి శ్రీనివాస్‌నగర్, వేగురుపల్లి, వెల్ది, ఊటూరు, లింగాపూర్ నుంచి, తిమ్మాపూర్ మండలానికి రేణికుంట, రామంచ నుంచి, శంకరపట్నం మండలానికి చల్లూరు, ఇప్పలపల్లి నుంచి, చిగురుమామిడి మండలానికి రామంచ నుంచి, సైదాపూర్ మండలానికి చల్లూరు, తనుగుల నుంచి ఇసుక సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ, ఈ రీచ్‌లు తమకు చాలా దూరమవుతున్నాయని, చార్జీల భారం అవుతాయని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత ఎక్కడా లేదు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలోనే త్వరగా ఇసుక రీచ్‌లు గుర్తించాం. తహసీల్దార్ల వద్ద కూపన్లు పెడితే లబ్ధిదారులకు అందుబాటులో ఉండరనే ఉద్దేశంతో గ్రామాల్లోనే ఉండే పంచాయతీ కార్యదర్శుల వద్ద అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరికి అవసరం పడినా సంబంధిత కార్యదర్శులను సంప్రదించి ఇసుక కూపన్లు తీసుకోవచ్చు. ఏ రోజు తీసుకున్న కూపన్ మీద అదే రోజు ఇసుక తెచ్చుకోవాలి. ఈ రోజు ఇచ్చిన కూపన్ మరుసటి రోజు చెల్లుబాటు కాదు.
ఒక ఇంటి నిర్మాణానికి అవసరమైన 25 క్యూబిక్ మీటర్లు అంటే 8 ట్రిప్పుల ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. బేస్మెంట్ లెవల్లో 2, రూప్ లెవల్లో 2, స్లాబ్ లెవల్లో 2, ఫినిషింగ్ లెవల్లో మరో 2 ట్రిప్పుల ఇసుక ఇస్తున్నాం. ఒక్కో రీచ్ లబ్ధిదారులకు 10 నుంచి 15 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండేలా చూశాం. ఇప్పటి వరకు మంజూరైన ఇండ్లలో ఇప్పుడిప్పుడే లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇసుక కొరత రాలేదు. రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– గంగాధర్, హౌసింగ్ ప్రాజెక్టు అధికారి